ఓ ప్రదక్షిణ… ఓ మొక్కు… ఓ అర్చన లేదా అభిషేకం… నైవేద్యం… దక్షిణ… ఇవి సమర్పించి హిందువులు తమ ఇష్ట దైవాన్ని పూజిస్తారు. తాము కోరుకున్న కోర్కెలు నెరవేరాలని, తమకు ఉన్న సమస్యలు పోవాలని దైవాన్ని ప్రార్థిస్తారు. అంతే… దాదాపుగా ఎక్కడ ఏ ఆలయంలోనైనా భక్తులు దైవాన్ని పూజించే విధానం ఇలాగే ఉంటుంది. కానీ… ఆ ఆలయంలో మాత్రం అలా కాదు. ఓ తాళాన్ని భక్తులు ఆలయంలో తగిలించి తమ కోర్కెలు నెరవేరాలని కోరుతారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందంటే…
అది కాన్పూర్‌లో ఉన్న బెంగాలీ మొహల్లా ప్రాంతంలోని కాళికా దేవి ఆలయం. ఆ ఆలయంలో భక్తులు తాళాలను లాక్ చేసి కడతారు. అలా చేస్తే తాము కోరుకున్నవి నెరవేరుతాయని, కాళికా దేవి అనుగ్రహిస్తుందని వారి నమ్మకం. ఇది ఇప్పటిది కాదు. ఏనాటి నుంచో అక్కడ ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఒకప్పుడు ఆ ఆలయానికి రోజూ ఓ భక్తురాలు వచ్చి కాళికా దేవిని ప్రార్థించేది. అప్పుడు అక్కడ పూజలు చేసే పూజారి ఆమెకు చెప్పాడట. లాక్ చేసిన తాళం ను అక్కడ కడుతూ మనస్సులో కోరిక కోరితే అది వెంటనే నెరవేరుతుందని అన్నాడట. దీంతో ఆమె అలాగే చేసింది. వెంటనే ఆమె కోరుకున్నది జరిగిందట. దీంతో అప్పటి నుంచి భక్తులు అలాగే చేస్తూ వస్తున్నారు.
అయితే భక్తులు తమ కోరిక నెరవేరగానే ఆ తాళాన్ని తీసేయాలట. అలా చేస్తేనే ఆ దేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని నమ్ముతారు. ఈ క్రమంలోనే ప్రతి ఏటా దసరా సందర్భంగా అక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో వేల మంది భక్తులు కాళికా అమ్మవారిని దర్శించుకుంటారు. తమ కోర్కెలు నెరవేరాలని తాళాలు కడతారు. మరుసటి రోజున పెద్ద ఎత్తున ఉత్సవం కూడా నిర్వహిస్తారు. ఎవరైనా అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని తాళం కడితే చాలు, వెంటనే కోరిక నెరవేరుతుందట..!