ఒకప్పుడంటే చాలా మంది కట్టెల పొయ్యిలు వాడేవారు కానీ… ఇప్పుడలా కాదు. చిన్న చిన్న కుగ్రామాల్లో నివసించే వారు కూడా ఎంచక్కా వంట గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారు. అయితే మీకు తెలుసా..? మనం నిత్యం వాడే పలు రకాల వస్తువులకు ఎక్స్‌పైరీ తేదీ ఉన్నట్టుగానే వంట గ్యాస్ సిలిండర్లకు కూడా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. కానీ విషయం గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. మరి ఎక్స్‌పైరీ తేదీ ఉంటే దాన్ని ఎలా కనుగొనడం..? అంటారా..? అయితే అది ఎలాగో కింద చదివి తెలుసుకోండి..!
చిత్రంలో చూపిన విధంగా వంట గ్యాస్ సిలిండర్‌పై A, B, C, D అక్షరాల కాంబినేషన్‌లో వాటి చివర్లకు ఏదైనా ఓ సంఖ్య వచ్చే విధంగా గుర్తులు ఉంటాయి. అయితే ఆ గుర్తులో ఉండే A, B, C, D లు నెలలను సూచిస్తాయి. అంటే… A అక్షరం అంటే జనవరి నుంచి మార్చి వరకు అని అర్థం. అదేవిధంగా B అంటే ఏప్రిల్ నుంచి జూన్ అని అర్థం వస్తుంది. C అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, D అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలో చిత్రంలో ఇచ్చిన విధంగా ఉన్న గుర్తులను ఆయా అక్షరాలకు ఇచ్చిన నెలల ప్రకారం పోల్చుకోవాలి. అయితే ఆ అక్షరాల పక్కన ఉన్న సంఖ్య మాత్రం సంవత్సరాన్ని సూచిస్తుంది.
మరి… పైన చెప్పిన విధంగా A, B, C, D అక్షరాలు వాటి పక్కన ఉండే సంవత్సరాలని బట్టి వంట గ్యాస్ ఎక్స్‌పైరీ తేదీని ఎలా గుర్తించవచ్చంటే… ఉదాహరణకు… B.25 అని ఉందనుకుందాం. అంటే ఆ సిలిండర్ జూన్ 2025 వరకు పనిచేస్తుందని అర్థం. అప్పటి వరకు ఆ సిలిండర్‌ను నిర్భయంగా వాడుకోవచ్చు. ఆ తేదీ దాటితే ఉపయోగించకూడదు. అలా చేస్తే సిలిండర్‌లో అధిక పరిమాణంలో ఉన్న వాయువు పీడనం వల్ల సిలిండర్ పగలడమే కాదు, పేలిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది. కనుక ఈ సారి మీరు సిలిండర్ పై వంట చేసేటప్పుడు లేదంటే సిలిండర్ తీసుకునేటప్పుడు ఈ తేదీపై ఓ కన్నేయండి. దాంతో ఆ సిలిండర్ ఎక్స్‌పైరీ తేదీ ఇట్టే తెలిసిపోతుంది.