Deepam : హిందూ సంప్రదాయంలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గుళ్లల్లో, ఇంట్లో పూజ చేసేప్పుడు దేవుడు ముందు దీపం పెట్టడం సహజం. పూజలు పెద్దగా చేయనివాళ్లు, చేయలేని వాళ్లు కూడా దేవుడి ముందు దీపం పెట్టి దండం పెట్టుకుంటారు. అంతటి విశిష్టత ఉన్న దీపాల పండుగే దీపావళి. చీకటిలో వెలుగులు విరజిమ్మే పండుగ. దీపావళి రోజున ప్రతి ఇంటి ముందు దీపాలు కొలువుదీరతాయి. ఎంతో ప్రాముఖ్యం ఉన్న దీపాల్ని పెట్టేటప్పుడు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుని పొరపాటు చేయకుండా దీపం వెలిగించండి.
దీపాన్ని దేవతా స్వరూపంగా చూస్తారు. అడుగుభాగంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, ప్రమిదలో శివుడు, వెలుగులో సరస్వతి, నిప్పు కణికలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని శాస్త్రం చెబుతుంది. అందుకే ప్రమిదకు గంధం, కుంకుమ బొట్టు, పూవులు పెట్టి, నమస్కరించి అక్షతలు వేస్తారు కొందరు. అంతేకాదు దీపానికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. లోహపు ప్రమిదల కంటే మట్టి ప్రమిదలు మంచిది. లోహాలు వేడెక్కడం వలన భూమి వేడెక్కుతుంది. అదే మట్టి ప్రమిదలైతే వేడిని గ్రహిస్తాయి. ఇళ్లల్లో పూజకు వాడేప్పుడు వెండి, ఇత్తడి ప్రమిదలు వాడొచ్చు.. కానీ స్టీలు ప్రమిదలు వాడకూడదు.
దీపంలో వత్తులు ఎన్ని పడితే అన్ని, ఎలా పడితే అలా వేసి దీపం వెలిగించకూడదు. దీపంలో రెండు వత్తులు వేసి, అది కూడా ఆ రెండింటిని కలిపి దీపం వెలిగించాలి. దీపం అనగానే ఆముదంతో లేదా నూనెతో వెలిగిస్తుంటారు. కానీ పండుగనాడైనా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. నెయ్యి లేని పక్షంలో నువ్వుల నూనె వాడడం ఉత్తమం. దీపాన్ని వెలిగించాక దీపం ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని శాస్త్రోక్తి. పూర్వం సర్వం కోల్పోయిన ఇంద్రుడు దీపారాధన వలననే సిరిసంపదలు తిరిగి పొందాడట. అందుకే దీపాలు పెట్టిన ఇంట సకల ఐశ్వర్యాలు కొలువవుతాయని పురాణాలు చెబుతున్నాయి.