ప్రపంచమంటేనే భిన్నమైన మనస్తత్వాలు గల వ్యక్తుల సమూహం. ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన అభిరుచి, ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే ఎవరైనా తమ ఇష్టానికి అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన రంగుల పట్ల ఆసక్తిని చూపుతారు. ఆ రంగులకు తగిన విధంగానే దుస్తులను కూడా ధరిస్తారు. ఇష్టమైన రంగుతో కూడిన దుస్తులను ధరించడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. అయితే మీకు తెలుసా..? వారంలో ఉన్న 7 రోజుల పాటు ఆ రోజుకు అనుగుణంగా పలు రంగుల దుస్తులను ధరిస్తే దాంతో ఎంతో ప్రయోజనం కలుగుతుందట. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదివారం… ఈ రోజున ఎరుపు, ఆరెంజ్ రంగులతో కూడిన దుస్తులు లేదా వాటి షేడ్స్ రంగులను కలిగిన దుస్తులను ధరించాలి. ఆ రోజు సూర్యుడి ఆధిపత్యం ఉంటుంది కనుక ఆ రంగు వస్త్రాలు ధరిస్తే ఎంతో మంచి జరుగుతుంది. సోమవారం… ఈ రోజున నీలి రంగు, సిల్వర్, లైట్ గ్రే రంగు దుస్తులను ధరించాలి. ఈ రోజుకు చంద్రుడు అధిపతి. అంతేకాకుండా సోమవారం శివుడికి ఇష్టం. కాబట్టి ముందు చెప్పిన రంగు దుస్తులను ధరిస్తే మంచి కలుగుతుంది.
మంగళవారం… ఈ రోజున ఆరెంజ్, ఎరుపు రంగు దుస్తులను ధరించవచ్చు. ఈ రోజుకు అంగారకుడు అధిపతి. ఇలాంటి రంగు దుస్తులను ధరిస్తే ఆ రోజు కచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. బుధవారం… ఈ రోజుకు బుధ గ్రహం అధిపతి. ఈ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి. దీంతో విజయం మీ సొంతమవుతుంది. గురువారం… పసుపు రంగు దుస్తులను ఈ రోజున ధరించాలి. బృహస్పతి ఈ రోజుకు అధిపతి. దీంతో పసుపు రంగు బట్టలను వేసుకుంటే ఈ రోజు అంతా మంచే జరుగుతుంది. కోరుకున్నవి సిద్ధిస్తాయి.
శుక్రవారం… ఈ రోజుకు శుక్రుడు అధిపతి. ఈ రోజున సముద్రపు ఆకుపచ్చ, తెలుపు, నీలి రంగు దుస్తులను ధరించాలి. దీంతో రోజంతా శుభమే కలుగుతుంది. శనివారం… నలుపు, నీలి, బూడిద రంగు దుస్తులను ఈ రోజు ధరించాలి. ఈ రోజుకు శని గ్రహం అధిపతి. కాబట్టి ఈ రోజున ముందు చెప్పిన రంగు దుస్తులను ధరిస్తే మనపై ఎలాంటి నెగెటివ్ ప్రభావాలు పడవు. అంతా మంచే జరుగుతుంది.