దేవాలయాలకే కాదు, ఇంట్లో పూజగదిలోకి వెళ్లాలన్నా హిందువులు కొన్ని ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినది చెప్పులు తొడుక్కోవడం. ఎవరూ కూడా చెప్పులు తొడిగి దేవాయాలకు, పూజ గదిలోకి వెళ్లరు. అలా చేస్తే ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. అయితే కేవలం పైన చెప్పిన రెండు ప్రదేశాలకే కాదు, ఇంకా పలు ప్రదేశాలకు వెళ్లినప్పుడు కూడా పాదరక్షలను తొడగకూడదట. అలా తొడిగితే అంతా అశుభమే కలుగుతుందట. ఇంతకీ ఆ ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆహార పదార్థాలను దైవంతో సమానంగా భావించడం హిందూ సాంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉంది. అందుకే వంట గదిలోకి వెళ్లినప్పుడు చెప్పులను తొడిగి వెళ్లకూడదు. బయట ఉంచే వెళ్లాలి. లేదంటే ఆ ఇంట్లోని వారికి అన్నీ అశుభాలే కలుగుతాయి. ధనం కోల్పోతారు.
బియ్యం, పప్పులు, ఉప్పులు వంటి సామాన్లను నిల్వ ఉంచే ప్రదేశాలకు, గదులకు చెప్పులను తొడుక్కుని వెళ్లకూడదు. ఆహారం అన్నపూర్ణా దేవితో సమానమట. అందుకే దాని వద్దకు వెళ్లినప్పుడు చెప్పులను తొడుక్కోవద్దని చెబుతారు. డబ్బులను దాచి ఉంచే లాకర్లు, బీరువాలు, ఇతర పెట్టెల వంటి వద్దకు చెప్పులు తొడుక్కుని వెళ్లకూడదు. డబ్బు అంటే ధనం. అంటే సాక్షాత్తూ లక్ష్మీ దేవి స్వరూపం కనుక వాటి వద్దకు కూడా చెప్పులు తొడుక్కుని వెళ్లకూడదు. మన దేశంలో గంగ, యుమన, సరస్వతి, కృష్ణా, గోదావరి వంటి పుణ్య నదులు ఎన్నో ఉన్నాయి. అయితే అలాంటి పుణ్య నదుల్లోకి చెప్పులు వేసుకుని వెళ్లకూడదట. లేదంటే అనేక పాపాలు చుట్టుకుంటాయట.
వినాయక చవితి, దసరా వంటి పండుగలకు ఆయా దేవుళ్ల విగ్రహాలను ప్రతిష్టిస్తాం కదా. అలాంటి వేదికల వద్దకు కూడా చెప్పులు తొడుక్కుని వెళ్లకూడదు. ఇంట్లోని పూజగదిలోకి, దేవుడి గుళ్లలోకి చెప్పులతో వెళ్లరాదు. ఇష్టదైవం ఉంటే ఇల్లు పవిత్రతకు నెలవు , పదిమంది పూజించే దేవుడి గుడిలోని దేవుడు కూడా అంతే పవిత్రం…అలాంటి ప్రదేశాల్లోకి చెప్పులతో వెళితే అశుభం.