Barasala : బిడ్డ పుట్టిన తర్వాత చేసే వేడుకలు చాలా ఉంటాయి. ఉయ్యాలో వేయడం, పేరు పెట్టడం, అన్నప్రాసన ఇలా.. బారసాల వేడుకని నామకరణ వేడుక అని కూడా అంటారు. బారసాలకి సంబంధించిన ముఖ్య విషయాలని ఈరోజు తెలుసుకుందాం. బారసాలని సాధారణంగా పిల్లల పుట్టిన 11వ రోజు చేస్తారు. లేదంటే 16వ రోజు, 21వ రోజు, మూడవ నెల లేదంటే 29వ నెలలో జరుపుతారు. పండితులు చేత ఒక మంచి ముహూర్తాన్ని పెట్టించి బారసాల చేయాలి.
బారసాల వేడుకలో కొన్ని పూజలని కూడా ప్రత్యేకించి చేస్తూ ఉంటారు. బారసాల వేడుక నాడు ఏం చేయాలనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంట్లో ఏ పూజ చేయాలన్నా కూడా మొదట ఇంటిని శుభ్రపరచాలి. బారసాల నాడు కూడా ఇంటిని ముందు శుభ్రం చేసుకోవాలి. తర్వాత శిశువుకి స్నానం చేయించాలి. కొత్త బట్టలు వేయాలి. ఉయ్యాలలో ఆరోజు ఉంచుతారు. మొదట వినాయకుడికి పూజ చేయిస్తారు.
తర్వాత పుణ్యవచనాన్ని చేస్తారు. ఆ తర్వాత కటి సూత్రధారణ చేస్తారు. కొంతమంది బిడ్డ పేరుని నిశ్చయించేటప్పుడు జన్మ నక్షత్రం ప్రకారం పెడతారు. కొంతమంది ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు నామకరణ చేస్తారు. కొంతమంది సంప్రదాయం ప్రకారం బిడ్డని ఉయ్యాల్లో పడుకోబెట్టి సాంప్రదాయ పాటలు పాడుతారు. ఈ కార్యక్రమంలో తల్లిని గౌరవిస్తారు. బిడ్డని కుటుంబంలో వారి పెద్దలు వచ్చి ఆశీర్వదిస్తారు. పేరు పెట్టేటప్పుడు తండ్రి శిశువు పేరుని శిశువు చెవిలో మూడు సార్లు చెప్తారు.
నేలమీద లేదంటే పళ్లెంలో పరిచిన బియ్యం మీద కూడా ఈ పేరుని రాయిస్తారు. పిల్లల మావయ్య ఆవు పాలు, తేనె మిశ్రమంలో ముంచిన బంగారు ఉంగరాన్ని తీసుకుని, శిశువు నాలుక మీద మొదట ఉంచుతారు. తర్వాత అక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా ఆశీర్వదిస్తారు. అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి, కూతురికి ఆ రోజు బట్టలు పెడతారు. సాంప్రదాయం ప్రకారం వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టాలనుకుంటే భోజనాన్ని పెడతారు. పేరు పెట్టిన రోజే ఉయ్యాలో వేయడం, బావిలో చేద వేయడం వంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. బావిలో చేద వేయడం అంటే అప్పటివరకు అమ్మాయి పనులేమీ చేయదు. కానీ ఆ రోజు నుండి ఆమె పనులు చేసుకోవాలని ఇలా మొదలు పెడతారు.