భారతదేశంలో గంగాజలానికి చాలా ప్రాధాన్యత ఉంది. గంగాజలం చాలా పవిత్రమైనది, శక్తివంతమైనదని మన భారతీయులు నమ్ముతారు. అందుకే ఏ ఒక్క పూజ గంగాజలం లేకుండా పూర్తికాదు. గంగాజలంలో మునిగినా, గంగా జలం సేవించినా.. ఎంతో పుణ్యమని విశ్వసిస్తారు. గంగాజలం ఇంతటి ప్రాధాన్యత పొందడానికి కారణమేంటి ? గంగాజలం ఎందుకు అంత పవిత్రమైనది ? గంగాజలంలో శుద్ధిచేసే తత్వం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. పూజాకార్యక్రమాల్లో గంగాజలం ఉపయోగిస్తే.. ఎలాంటి దోషం ఉన్నా తొలగిపోతుందని భక్తుల నమ్మకం. పరమ పవిత్రమైన గంగానదిలో మునిగితే.. స్వర్గలోకం ప్రాప్తి లభిస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు. అందుకే గంగానదిపై అనేక అధ్యయనాలు కూడా జరిగాయి. ఈ అధ్యయనాలు గంగాజలం గురించి ఏం చెబుతున్నాయి.
మన పాపాలన్నీ కడగడానికి స్వర్గలోకం నుంచి వచ్చిన జలముగా గంగాజలానికి ప్రత్యేకత ఉంది. భగీరథుడు గంగాజలాన్ని భూమ్మీదకు తీసుకొచ్చాడని పౌరాణిక కథలు వివరిస్తున్నాయి. హిమాలయాల్లోని గౌముఖ్ దగ్గర గంగా నది ముందుగా భగీరథగా ఉద్భవించింది. తర్వాత 75 చదరపు మైళ్లు ఇది ప్రవహించి.. దేవప్రయాగలోని అలకనందలో కలిసిపోతుంది. ఇలా కలవడం వల్ల ఈ నదికి గంగానదిగా పేరు వచ్చింది. గంగానదుల్లోకి కలిసే మరో పెద్ద నది.. కైలాస పర్వతానికి అతి దగ్గరగా ఉన్న ఘాగరా నది గంగానదిలో కలుస్తుంది. అలాగే కాట్మాండుకి దగ్గరలోని ఘాంటాక్ అనేది పవిత్ర నది. ఈ రెండు నదుల పవిత్ర జలం గంగానదిలో కలవడం వల్ల.. ఈ నీళ్లు చాలా పవిత్రమయ్యాయని ఆధ్మాత్మిక వేత్తలు చెబుతారు. గంగాజలం హిందువులు విశ్వసించే బ్రహ్మ, విష్ణు, శివులతో కలిసినదిగా చెబుతారు. బ్రహ్మ గంగాజలాన్ని త్రివిక్రముని అవతారంలో మహావిష్ణువు పాదాలు కడగడానికి ఉపయోగించారట.
భూమ్మీద ప్రశాంతత కల్పించడానికి తన తల నుంచి గంగాజలాన్ని భూమ్మీదకు పంపడానికి శివుడు అంగీకరించాడు. అందుకే శివుడికి గంగాధరుడు అనే పేరు ఉంది. మహర్షి వేదవ్యాసుడు గంగా జలాన్ని దుష్టశక్తుల నిర్మూలను ఉపయోగించారట. గంగానదిలో మునగడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. గంగానదిలో చనిపోయిన వాళ్ల అస్థికలు కలపడం వల్ల వాళ్లకు విముక్తి లభిస్తుంది. గంగాజలంలో అనేక గుణాలున్నాయి. ఇందులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండటం వల్ల పూజలకు ఉపయోగిస్తారు. గంగాజలంపై జరిగిన అధ్యయనాల్లో అత్యంత ఆసక్తికర విషయం తేలింది. గంగాజలంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నయని సైంటిఫిక్ గా నిరూపించబడింది. అందుకే ఈ నీటిని సేవించడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా నశిస్తుందని నిపుణులు చెబుతున్నారు.