ఈ లోకంలో పూజించే సకల దేవుళ్లకు, దేవతలకు విగ్రహాలు, ఆకారాలున్నాయి. అందరు దేవుళ్లకంటే.. విభిన్నంగా అందరినీ ఆశ్చర్యపరిచే దైవం శివుడు. ఈ పరమాత్ముడు విగ్రహ రూపంలో కంటే కూడా ఎక్కువగా లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. ఏ ఆలయాల్లోనైనా శివలింగమే ప్రత్యక్షమవుతుంది. శివుడిని లింగరూపంలో ఎక్కువగా పూజించి తరిస్తారు. ఎందుకు ? శివుడికి మాత్రమే ఈ లింగరూప ప్రత్యేకత ? శివుడి చిహ్నాలకు, ఆరోగ్యానికి ఉన్న సంబంధమేంటి ?
కోరివచ్చిన భక్తులకు ముక్తిని ప్రసాదించే శక్తి శివుడికి ఉందని వేదాలు చెబుతున్నాయి. అలాగే శివుడి విషయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇతర దేవతలకు ఎవరికీ లేని విధంగా శివుడికి లింగరూపం ఉంది. మహేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపుడు. ఆ పరబ్రహ్మ తన ఇచ్ఛానుసారం కొన్నిసార్లు నిరాకారుడిగానూ, కొన్నిసార్లు సాకారుడిగానూ ఉంటాడు. నిరాకారుడికి చిహ్నమే శివలింగం. శివుడి 19 అవతారాలు మీకు తెలుసా?
పరమాత్మ అనంతశక్తి సంపన్నుడు. జ్ఞానస్వరూపమైన పరమాత్మను లింగరూపంలో పూజించటం జ్ఞానశక్తిని ఆరాధించటానికి సంకేతం. పరమాత్మలోని అనంతశక్తిని లింగరూపములో స్థాపించి ఆరాధించటంలో వైజ్ఞానిక రహస్యం దాగుంది. అందుకే లింగరూపంలో మనం శివారాధన చేస్తున్నాం. ప్రకృతిసిద్ధమైన కొండలు, పర్వతాలను ఆ శక్తికి సంకేతంగా భావిస్తున్నాం.