గాయత్రి మంత్రం చాలా పవర్ ఫుల్ మంత్రంగా భావిస్తారు. వేదాలలో రాసిన ఈ మంత్ర స్మరణ ద్వారా శారీరక, మానసిక ప్రభావం ఉంటుందని చెబుతారు. ఈ గాయత్రి మంత్రంలో అద్భుతమైన శక్తి ఉంది. దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రం జపిస్తారు. దేవుడి ఆశీస్సులు, సామాజిక ఆనందం, సంపద కోసం ఈ మంత్రం జపిస్తారు. ఈ మంత్రం జపించడానికి రోజూ మూడు సందర్భాలు ముఖ్యంగా చెబుతారు. సంధ్యాసమయం, సూర్యోదయానికి ముందు, సూర్యుడు అస్తమించే వరకు ఈ మంత్రం జపించవచ్చు. సమయాన్ని పక్కనపెడితే.. ఈ మంత్రం జపించాలనుకునే వాళ్లు ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో, మనుసు నిర్మలంగా చేసుకుని.. నిశ్శబ్దంగా గాయత్రి మంత్రం జపించాలి. ఈ మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా చదవకూడదు.
ఈ మంత్రాన్ని జపించేటప్పుడు చేతిలో రుద్రాక్ష మాల పట్టుకుని స్మరించడం ద్వారా మరింత ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ మంత్రం జపించడం ద్వారా నిజాన్ని తెలుసుకోగలుగుతారని అర్థం. అలాగే మనలోని తెలివి తేటలను మరింత పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని అర్థాన్ని వివరిస్తుంది. గాయత్రి మంత్రం జపించడం ద్వారా మనలోని భక్తి మరింత పెరుగుతుంది. భక్తి పెరిగిన తర్వాత దేవుడు మీ స్మరణ వింటాడు. చాలా మంది కొన్ని సందర్భాల్లో శకునం బాగోలేక అనారోగ్యం పాలవుతుంటారు. అలాంటప్పుడు గాయత్రి మంత్రం జపించడం ద్వారా అలాంటి కీడు, శకునం నుంచి బయటపడతారు. గాయత్రి మంత్రం జపించడం వల్ల భవిష్యత్ లో మీ వారసులు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. వాళ్లు మంచి సిరిసంపదలు పొందుతారు.
ఎవరైతే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారో వాళ్ల కుటుంబంలో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ మంత్రం స్మరించడం ద్వారా మీ కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది. గాయత్రి మంత్రం అందరికీ మంచిది. అయితే.. చిన్న పిల్లలకు అయితే మరింత ప్రయోజనకరం. రోజూ గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల పిల్లల్లో తెలివి పెరుగుతుంది. వాళ్లు అనుకున్నది సాధించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే.. ప్రతి మంగళవారం, ఆదివారం, అమావాస్య రోజు ఎరుపు దుస్తులు ధరించి ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం జపించేటప్పుడు దుర్గా దేవిని స్మరించాలి. ఇలా చేయడం వల్ల మీకు శత్రుభయం నుంచి విముక్తి కలుగుతుంది. ఒకవేళ మీ పెళ్లి వాయిదా పడుతూ వస్తున్నా, పెళ్లి కుదరకుండా ఉన్నా.. ప్రతి సోమవారం పసుపు రంగు దుస్తులు ధరించి 108 సార్లు గాయత్రి మంత్రం స్మరించాలి. ఇలా గాయత్రి మంత్రం జపించేటప్పుడు పార్వతీ దేవిని మననం చేసుకోవాలి. ఇలా చేస్తే.. త్వరలోనే మీ పెళ్లి బాజా మోగుతుంది.
దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడాలంటే.. ఈ మంత్రాన్ని ఏదైనా మంచి రోజు జపించాలి. ఒక కుండ నిండా తాజా నీటిని తీసుకుని పక్కన పెట్టుకుని, ఎరుపు రంగు వస్ర్తంపై కూర్చుని ఈ మంత్రం జపించాలి. మంత్ర జపం పూర్తయిన తర్వాత ఆ నీటిని తాగాలి. రోజూ క్రమం తప్పకుండా.. గాయత్రి మంత్రం చదువుతూ ఉంటే.. మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. క్రమం తప్పకుండా గాయత్రి మంత్రం జపిస్తూ ఉండటం వల్ల మీలో ఉండే చెడు ఆహారపు అలవాట్లు తొలగిపోతాయి. మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకుంటారు. మీరు ఒకవేళ కంటి సమస్యలతో బాధపడుతుంటే.. మీకు గాయత్రి మంత్రం సహాయపడుతుంది. కంటి చూపు సమస్యలు, కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా.. గాయత్రి మంత్రం స్మరించడం ద్వారా దూరమవుతాయి. గాయత్రిమంత్రం జపించడం వల్ల మనలో భక్తిని, దేవుడిపై మనసుని లగ్నం చేయడమే కాకుండా.. జ్ఞానోదయం కలిగిస్తుంది. గాయత్రి మంత్రం జపించడం వల్ల మీలో ఆధ్యాత్మిక సంతృప్తిని, దైవ సంబంధమైన ప్రశాంతతను కల్పిస్తుంది. మీ జీవితంలోనే అన్ని రకాల కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది.