Achamanam : మనం ఏదైనా పూజ చేసేటప్పుడు మొదట దీపారాధన చేస్తూ ఉంటాము. ఆ తర్వాత మనం ఆచమనం చేస్తూ ఉంటాము. అయితే ఆచమనం ఎందుకు చేయాలి..? దీని వెనుక ఏదైనా ముఖ్య కారణం ఉందా..? ఆ విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. నిజానికి ఆచమనం చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది. మన గొంతు ముందు భాగంలో నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి. దీన్ని స్వర పేటిక అంటాము. దీని చుట్టూ కవచం ఉంటుంది. దీంతో కొంత దాకా మనకి రక్షణ కలుగుతుంది. అయితే ఏ చిన్న గాయమైనా స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోతుంది. ప్రాణం కూడా పోవచ్చు. స్వర పేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇవి చాలా సున్నితమైనవి.
ముక్కు, నోరు, పెదవులు, నాలుక, దంతాలు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక, అలానే గొంతు లోపలి భాగం, శ్వాసనాళం, అన్న నాళం ఇటువంటివన్నీ కూడా నాజూగ్గా ఉంటాయి. వీటికి బలం కలిగించి, ఉత్తేజ పరుస్తుంది ఆచమనం ప్రక్రియ. మన గొంతులో నుండి శబ్దం వెలువడేటప్పుడు అక్కడ ఉన్న గాలి బయటకి రావడం జరుగుతుంది. అయితే గాలి లోపల నుండి బయటకు వస్తున్నప్పుడు వేగం వుండకూడదు. శబ్దం చాలా సులభంగా, స్పష్టంగా ఉండాలి.
కేశవాయ స్వాహా అని అన్నప్పుడు అది గొంతు నుండి వస్తుంది. నారాయణ స్వాహా అనేది నాలుక సహాయంతో బయటకు వస్తుంది. మాధవాయ స్వాహా అనేది కేవలం పెదవులు మాత్రమే పలుకుతాయి. అయితే ఇలా మనం ఆచమనం చేయడం వలన గొంతు, నాలుక, పెదవులకి వ్యాయామం అవుతుంది. నోటితో చెప్తే సరిపోతుంది కదా.. చేతితో ఎందుకు నీళ్లు తాగాలి అనేది చూస్తే.. చేతుల్లో కొంత విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది.
చేతిలో నీళ్లు వేసుకుని తాగితే ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని, నోటి నుండి శరీరంలోకి వెళ్తాయి. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా సమతావుగా ఉండేట్టు చేస్తుంది. ఇలా మనం కొద్దికొద్దిగా వీటిని చెబుతూ నీళ్లు తాగడం వలన నాలుక, గొంతు, పేగుల వరకు ఉన్న సున్నితమైన అవయవాలన్నీ కూడా ఉత్తేజంగా మారతాయి. ఇదీ ఆచమనం వెనుక ముఖ్య కారణం.