Balakrishna : నందమూరి బాలకృష్ణ మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అనే చెప్పాలి. ఆయన సినిమాలలో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తప్పక ఉంటాయి. పవర్ ఫుల్ డైలాగ్స్, చేజింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ వంటివి బాలయ్య సినిమాలో లేకపోతే అభిమానులకి నిరాశే ఎదురవుతుంది. అయితే బాలయ్య సినిమాలో ఒక్క ఫైట్ సీన్ లేకుండా రూపొందిన చిత్రం సూపర్ డూపర్ హిట్టైంది. ఆ సినిమా ఏంటో తెలుసా.. నారీ నారీ నడుమ మురారి. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రమిది. యువచిత్ర బ్యానర్‌పై, కె.నరసింహ నాయుడు నిర్మాతగా, స్టార్ డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో, శోభన, నిరోషా హీరోయిన్స్‌గా, కైకాల సత్యనారాయణ, శారద ప్రధాన పాత్రల్లో నటించిన నారీ నారీ నడుమ మురారి చిత్రం.. 1990 ఏప్రిల్ 27న విడుదలైంది.
కెరీర్‌లో 50వ చిత్రం అయినా ఎటువంటి కమర్షియల్ హంగులకు పోకుండా కుటుంబ కథా చిత్రాన్ని ఎంపిక చేసుకుని.. ప్రేక్షకాభిమానులను అలరించాడు బాలయ్య. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కె.వి.మహదేవన్ స్వరపరచిన పాటలు, నేపథ్య సంగీతం, ఎ.విన్సెంట్, అజయ్ విన్సెంట్ కెమెరా వర్క్, ఆచార్య ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల పాటలు, తనికెళ్ల భరణి, భమిడిపాటి రాధాకృష్ణ, జి.సత్యమూర్తి, వినాయక శర్మ రాసిన మాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి.
ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకపోవడం విశేషం. బాలయ్య నటజీవితంలో నారీ నారీ నడుమ మురారి ప్రత్యేకమైన చిత్రం అని చెప్పొచ్చు. బాలయ్య నటన, కామెడీ టైమింగ్, డ్యాన్సులు.. అభిమానులను అలరించాయి. తమిళనాడులో వేలచ్చేరి ప్రాంతంలోని చిరంజీవి గెస్ట్ హౌస్ లో ఈ మూవీ షూటింగ్ జరిగింది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. మాస్ హీరో క్లాస్ మూవీ చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి.. నారీ నారీ నడుమ మురారి సినిమానే నిదర్శనం అని చెప్పొచ్చు.