Naga Chaitanya : దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.. హే సినామిక. ఈ సినిమా మార్చి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు గాను తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి తాను, దుల్కర్ సల్మాన్ మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు. అప్పట్లో తాము సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం కాదని.. కేవలం బైక్‌లు, కార్ల గురించే తమ చర్చంతా జరిగేదని తెలిపారు.
దుల్కర్ సల్మాన్ మళయాళంతో మొదలు పెట్టి ఇతర భాషల ఇండస్ట్రీల్లోనూ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారని నాగచైతన్య అన్నారు. హే సినామిక చిత్రం హిట్ కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సందర్భంగా బృంద మాస్టర్ ఆధ్వర్యంలో నాగచైతన్య పలు డ్యాన్స్ స్టెప్స్ వేసి అలరించారు.
కాగా ఈ కార్యక్రమంలో నాగచైతన్య చాలా కొత్తగా కనిపించారు. ఎన్నడూ లేనిది పూర్తి స్థాయి మీసంతో దర్శనమిచ్చారు. ఆయన తాజాగా దూత అనే అమెజాన్ ప్రైమ్ హార్రర్, థ్రిల్లర్ సిరీస్‌లో నటిస్తున్నారు. బహుశా ఆ సిరీస్ కోసమే ఆయన ఇలా మారారని అంటున్నారు. ఇక ఈ సిరీస్‌తోపాటు చైతూ ఈ మధ్యే థాంక్ యూ అనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఇందులో చైతన్య పక్కన రాశీ ఖన్నా హీరోయిన్గా నటించింది. అలాగే త్వరలో లాల్ సింగ్ చడ్డా అనే బాలీవుడ్ మూవీలో చైతన్య కనిపించనున్నారు. ఇందులో అమీర్‌ఖాన్ ప్రధాన పాత్ర పోషించారు.