ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫిలిం ఇండస్ట్రీలు ఉన్నాయి. ఏ ఫిలిం ఇండస్ట్రీ అయినా సరే తమ మార్కెట్‌కు అనుగుణంగా ప్రేక్షకుల సెంటిమెంట్‌ను బట్టి చిత్రాలను తెరకెక్కిస్తుంటారు. హాలీవుడ్ స్థాయి చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంటుంది. మార్కెట్ చాలా పెద్దది. కనుక వారు భారీ కమర్షియల్ హంగులు, నిర్మాణ విలువలతో సినిమాలను తీస్తారు. వారు కథకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అవసరం అయితే అందులో హీరో క్యారెక్టర్‌ను చంపుతారు కూడా. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలా కాదు.
తెలుగు సినిమా ప్రేక్షకులు ఇతర ఇండస్ట్రీలకు చాలా భిన్నం అనే చెప్పవచ్చు. ఇక్కడ కథ ఉన్నా లేకున్నా కమర్షియల్ హంగులు ఉండాలి. హీరో పాత్రను చంపేస్తే ఊరుకోరు. అవసరం అయితే హీరోయిన్ క్యారెక్టర్ ఏమైనా ఫర్వాలేదు అని చూస్తారు. అలాగే హీరో అన్నా క కచ్చితంగా విలన్‌పై విజయం సాధించాలి. సినిమా ఎల్లప్పుడూ శుభంగా ముగియాలి. విషాదంగా ముగియకూడదు. ఇలా కాకుండా ఏ చిత్రాన్ని అయినా తెరకెక్కిస్తే దర్శకుడు, నిర్మాత పప్పులో కాలేసినట్లే అవుతుంది.
ఇక తమిళ సినీ ప్రేక్షకులు పూర్తిగా భిన్నం. సినిమాలో కథ ఉండాలి. కమర్షియల్ హంగులు ఉండాలి. కథ డిమాండ్ చేస్తే హీరో క్యారెక్టర్‌ను చంపినా ఫర్వాలేదు. అలాగే కథను బట్టి సినిమా విషాదాంతంగా ముగిసినా ఓకే. కానీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి. అందుకనే అక్కడి వారు ఎక్కువగా కథలకు ప్రాధాన్యతను ఇస్తారు. తమిళ సినిమాలు చాలా వరకు విషాదంగా ముగుస్తాయని చెప్పడంలో అర్థం లేదు. కానీ తెలుగు సినిమాలతో పోలిస్తే అక్కడి సినిమాల్లో కొంత శాతం ఎక్కువగానే విచారకరమైన ఎండింగ్‌తో సినిమాలు ముగియడాన్ని చూడవచ్చు. అంతే కానీ అలాంటి సినిమాలే అక్కడ ఎక్కువ నడుస్తాయి అని కూడా చెప్పలేం.