కొందరికి ఉదయం లేవగానే సోమరితనం, మరికొందరికి ఆఫీస్‌కి వెళ్లాలనే కంగారు. వీకెండ్స్ అయితే బెడ్ పైనే గడిపేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఉదయం పూట దినచర్య ఒక పద్ధతి లేకుండా సాగుతుంటుంది. కానీ, మీకంటూ ఒక దినచర్య ఉంటే, ఆ రోజంతా ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా, ఉదయాన్నే యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి, రోజును కొత్త శక్తితో మొదలుపెట్టవచ్చు. హ్యాబిల్‌డ్ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన సౌరభ్ బోత్రా, ఉదయం పూట కొన్ని సాధారణ యోగాసనాలు ఎలా మీ దినచర్యకు ఒక క్రమబద్ధతను తీసుకొస్తాయో పంచుకున్నారు. ఉదయాన్ని బాగా ప్రారంభిస్తే, ఆ రోజంతా మన శక్తి, మానసిక స్థితి, ఏకాగ్రతలో చాలా మార్పు వస్తుంది. వేల సంవత్సరాలుగా యోగా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
మొదటి నెలలో వారానికి 3-4 సార్లు సులభంగా చేయగలిగే ఆసనాలతో మీరు ప్రారంభించవచ్చుఅని సౌరభ్ చెప్పారు. మరి ఆ ఆసనాలేంటి, వాటి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. యోగా చేసే ముందు శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. వార్మప్ వల్ల శరీరం తేలికపడుతుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. గాయాలు కాకుండా చూస్తుంది. చేతులను పక్కలకు చాచి, భుజాలను పదిసార్లు ముందుకు, పదిసార్లు వెనక్కి తిప్పండి. ఇది భుజాల నొప్పులను తగ్గిస్తుంది. చేతులను ముందుకు లేదా పక్కలకు చాచి, పిడికిలి బిగించి, మణికట్టును పదిసార్లు రెండు వైపులా తిప్పండి. ఇది మణికట్టు కీళ్లను వదులు చేస్తుంది. మెడను నెమ్మదిగా పక్కలకు వంచండి. ఒక చేతిని పైకి లేపి, పక్కకు వంగండి. ఆపై కిందకు వంగి కాలి వేళ్లను తాకి, కాళ్లను సాగదీయండి. చివరగా, మీ చేతులను వెనక వైపు కలుపుకొని, ఛాతీని మెల్లగా పైకి లాగండి. ఇది శరీరాన్ని మరింత ఉత్సాహంగా, సిద్ధంగా ఉండేలా చేస్తుంది.
సూర్య నమస్కారాలు.. ఇది 12 దశల వ్యాయామం. పూర్తి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. శరీరాన్ని వంచడం, సాగదీయడం ద్వారా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. బలం, ఓర్పును పెంచుతుంది. ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే వీటిని చేయవచ్చు. కాళ్లు కలిపి నిటారుగా నిలబడి, చేతులను నమస్కార స్థితిలో ఉంచండి. శ్వాస తీసుకుంటూ చేతులను పైకెత్తి, నెమ్మదిగా వెనక్కి వంగండి. శ్వాస వదులుతూ ముందుకు వంగి కాలి వేళ్లను తాకండి. ఒక కాలు వెనక్కి తీసి, లంజ్ పొజిషన్‌లోకి రండి. తర్వాత ప్లాంక్ పొజిషన్‌లోకి వచ్చి, నెమ్మదిగా శరీరాన్ని కిందికి దించండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి వంగండి (కోబ్రా పోజ్ లాగా). శ్వాస వదులుతూ, తుంటిని పైకి లేపి, డౌన్‌వర్డ్ డాగ్ పొజిషన్‌లోకి రండి. అదే కాలును ముందుకు తీసుకొచ్చి, మళ్ళీ ముందుకు వంగండి. తర్వాత చేతులు పైకెత్తి, ప్రార్థన స్థితికి రండి. ఇదే విధంగా రెండో కాలితో కూడా చేయండి. ఇలా ఒక రౌండ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల శరీరం చురుకుగా మారుతుంది. కండరాలు బలపడతాయి. రోజంతా రిఫ్రెష్‌గా, ఏకాగ్రతతో ఉంటారు.