ఇప్పుడంటే వాహనాలు వచ్చాయి. కనుక ప్రయాణాలు సులభతరం అయ్యాయి. చిన్నపాటి దూరాలకు కూడా చాలా మంది వాహనాలను ఉపయోగిస్తున్నారు. కానీ ఒకప్పుడు సైకిళ్లను ఎక్కువగా వాడేవారు. అందువల్ల వారు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్‌ను తొక్కేవారు ఎక్కువే. అయితే సైకిల్ తొక్కడం వల్ల మన శరీరానికి అద్భుతమైన వ్యాయామం జరుగుతుంది. ఈ క్రమంలోనే రోజుకు కనీసం 30 నిమిషాల పాటు అయినా సైకిల్ తొక్కడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి సైకిల్ తొక్కడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. గంట సేపు సైకిల్ తొక్కితే 300 క్యాలరీలు ఖర్చవుతాయి. 30 నిమిషాలపాటు సైకిల్ తొక్కడం వల్ల 150 క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. అదే వేగంగా సైకిల్ తొక్కితే రెట్టింపు స్థాయిలో క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. రోజూ 100 క్యాలరీల చొప్పున వారానికి 700 క్యాలరీలను ఖర్చు చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యాయామం చేయలేమని అనుకునేవారు సైకిల్ తొక్కడం ప్రారంభించవచ్చు. దీంతో వ్యాయామం అవుతుంది. వారానికి ఖర్చు చేయాల్సిన క్యాలరీలను పూర్తి చేస్తారు. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.
2. సైకిల్ తొక్కడం వల్ల వేగంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కొవ్వ కరుగుతుంది. అధిక బరువు తగ్గాలని అనుకునేవారు సైకిల్ తొక్కడం ప్రారంభించాలి. దీంతో బరువు త్వరగా తగ్గవచ్చు.
3. రోజూ కనీసం 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 50 శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక సైకిల్ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
4. సైకిల్ తొక్కడం వల్ల దాదాపుగా శరీరంలోని కండరాలన్నీ పనిచేస్తాయి. దీంతో కండరాలు దృఢంగా మారుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి.
5. సైకిల్ తొక్కే వారిలో మెటబాలిజం మెరుగు పడుతుంది. జీవక్రియలు సరిగ్గా జరుగుతాయి. కీళ్లు, మోకాళ్లు దృఢంగా మారుతాయి.
6. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఎముకలు దృఢంగా మారుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.