ఎప్పటినుండో జోగింగ్ చేయాలని అనుకుంటున్నారు. కాని ఉదయం వేళ త్వరగా బెడ్ పైనుండి లేవటం కష్టంగా వుంది. మీలాగే చాలామంది ఈ రకంగా అనుకుంటూ వుంటారు. కాని ఆరోగ్యంగాను, శారీరక ధృఢత్వంతోను వుండటం ప్రధానమని గుర్తించాలి. మానసికంగా ముందు సిద్ధం కావాలి. వేసుకున్న జోగింగ్ ప్రణాళికను అమలు చేయటానికి నిర్ణయించుకోవాలి. జోగింగ్ మొదలు పెట్టినపుడు అధిక దూరాలు జోగింగ్ చేయవద్దు. ప్రతి వారం కొద్దిపాటి అదనపు దూరాన్ని చిరునవ్వులు చిందిస్తూ పరుగెడుతూ వుండండి. షాపింగ్ చేయటానికి ఇష్టపడేవారైతే మార్కెట్ లో దొరికే సౌకర్యవంతమైన జోగ్ సూట్ ను ఖరీదు చేసి ధరించండి.
మీ కొత్త దుస్తుల్లో ఎంతో హాయి ఫీలవుతారు. పక్కన తోడు ఎవరూ లేరని మీ జోగింగ్ ఆపవద్దు. బదులుగా మీ కిష్టమైన మ్యూజిక్ ను వింటూ పరుగుపెట్టటమో లేదా బ్రేక్ ఇచ్చినపుడు మధ్యలో వార్తాపత్రిక చదువుకోడమో చేసి పక్కన తోడు లేని లోటును భర్తీ చేసుకోండి. మీ జోగింగ్ సమయంలో పార్కులో జనాలు అధికంగా వుండి అసౌకర్యంగా వుందా? ఒక గంట ముందే మీరక్కడకు వెళ్ళి మీ జోగింగ్ పూర్తి చేయండి. లేటుగా లేవటాన్ని ఇష్టపడేవారైతే కనీసం వారానికి నాలుగు రోజులే (సోమవారం నుండి గురువారం వరకు) జోగ్ చేయండి. కొత్తగా మొదలు పెట్టే వారికి ఇది చాలా మంచిది.
జోగింగ్ తర్వాత పని మొదలు పెట్టే ముందు ఒక గ్లాసెడు పండ్ల రసం లేదా మాల్ట్ వంటివి తీసుకొని కొద్ది సమయం రిలాక్స్ అవండి. సాయంత్రం పనినుండి ఇంటికి వచ్చిన తర్వాత, కొద్దిపాటి వామ్ అప్ వ్యాయామాలు, ఎరోబిక్స్ చేయండి. దీనితో రోజంతా మీకు చురుకుగా, ఆహ్లాదంగా వుంటుంది. కొత్తగా మొదలుపెట్టే వారు మానసికంగా సిద్ధం చేసుకోవాలి. కారణాలు ఎన్నో చూపవచ్చు. కాని ఆరోగ్యానికి మించినది ఏదీ లేదన్న విషయం గుర్తుంచుకోవాలి.