మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అవును.. మనం చేసే తప్పులు, పాటించే అలవాట్లు, తినే ఆహారం.. వంటి కారణాలే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. కనుక మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. మన నిత్య జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, కొన్ని సూచనలను పాటిస్తూ చాలు. దాంతో ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఆ మార్పులు, సూచనలు ఏమిటంటే…
1. ఆరోగ్యకరమైనవి తినడం
నిత్య జీవితంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలను తింటుంటారు. జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, వేపుళ్లు వంటి పదార్థాలను తింటారు. వాటిని పూర్తిగా మానేయడం మంచిది. ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు. కానీ వీటిని రోజూ అస్సలు తీసుకోరాదు. ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్యం త్వరగా మెరుగు పడుతుంది. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు రావు.
2. నిద్ర
కొందరు రాత్రిపూట ఆలస్యంగా పడుకుంటారు. ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు. ఇలా చేయడం వల్ల జీవ గడియారం దెబ్బ తింటుంది. జీవన విధానం అస్తవ్యస్తంగా మారుతుంది. ఫలితంగా అది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కనుక రోజువారీ జీవన విధానంలో నిద్రలో మార్పులు చేసుకోవాలి. త్వరగా నిద్రించి త్వరగా నిద్ర లేవాలి. దీని వల్ల కొద్ది రోజుల్లోనే తేడాను గమనిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.
3. వ్యాయామం
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేయాలి. ఎంతో కొంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. కనీసం 30 నిమిషాల పాటు రోజూ వాకింగ్ చేయాలి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారు.
4. బరువు
సరైన బరువు ఉన్నవారు దాన్ని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. బరువు లేని వారు సరైన బరువు పెరిగే ప్రయత్నం చేయాలి. అదే బరువు ఎక్కువగా ఉన్నవారు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మన ఆరోగ్యం విషయంలో బరువు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
5. చర్మ సంరక్షణ
శరీర సంరక్షణ మాత్రమే కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే చర్మాన్ని కూడా సంరక్షించుకోవాలి. అందుకు గాను బయటకు వెళ్లినప్పుడు చర్మానికి సంరక్షణగా ఉండేందుకు దుస్తులను ధరించాలి. ఎండలో ఎక్కువ సేపు ఉండరాదు. దుమ్ము, ధూలి చర్మానికి తగలకుండా జాగ్రత్త వహించాలి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
6. ధూమపానం, మద్యపానం
కొందరు ఆరోగ్యంగానే ఉంటారు. నిత్యం వ్యాయామం చేస్తారు. అవసరం అయిన అన్ని జాగ్రత్తలను పాటిస్తారు. కానీ ధూమపానం, మద్యపానం చేస్తారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి తప్ప ప్రయోజనం ఉండదు. అందువల్ల ఈ రెండింటినీ మానేస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
7. పౌష్టికాహారం
నిత్యం మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా జాగ్రత్త పడాలి. దీని వల్ల శరీరానికి రోజూ అన్ని విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
8. వైద్య పరీక్షలు
కొందరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. కానీ ఒక్కసారి ఏదైనా అనారోగ్య సమస్యలకు లోనైనా లేదా ప్రమాదాల బారిన పడినా వైద్య పరీక్షలు చేస్తే వారిలో ఉండే రోగాలన్నీ బయట పడతాయి. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. శరీరం బయటకు చూసేందుకు ఆరోగ్యంగానే కనిపిస్తుంది. కానీ మనకు ఏయే సమస్యలు ఉన్నాయో పరీక్షలు చేయించుకునే వరకు తెలియదు. కనుక ప్రతి ఒక్కరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. దీని వల్ల అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.