Tooth Paste : టూత్ పేస్ట్ అంటే సహజంగానే నిత్యం మనం దాంతో దంతాలను తోముకుంటుంటాం. దంతాలను శుభ్రం చేసేదిగానే టూత్‌పేస్ట్ చాలా మందికి తెలుసు. అయితే వాస్తవానికి పలు ఇతర పనులకు కూడా మనకు టూత్ పేస్ట్ ఉపయోగపడుతుంది. దాంతో పలు రకాల వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు. మరి టూత్ పేస్ట్ ను ఇతర ఏయే పనులకు వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. చిన్నపిల్లల పాల బాటిళ్లను ఎన్నిసార్లు శుభ్రం చేసినా వాసన పూర్తిగా పోదు. అలాంటప్పుడు కొద్దిగా టూత్ పేస్ట్‌ని బాటిల్ క్లీన్ చేసే బ్రష్‌కి పెట్టి లోపల బాగా రుద్ది నీటితో కడిగితే వాసన పోతుంది. నీళ్ల బాటిళ్లు, ఫ్లాస్క్‌లని కూడా ఈ విధంగా శుభ్రం చేసుకోవచ్చు.
2. టూత్‌పేస్ట్‌ని కొద్ది మొత్తంలో తీసుకుని నిద్ర పోయే ముందు మొటిమల మీద అద్దితే అందులోని తేమను పీల్చుకుని తెల్లారేసరికి మొటిమల్ని మాయం చేస్తుంది.
3. కారు హెడ్ లైట్స్ మీద దుమ్ము, ధూళి చేరి అస్పష్టంగా కనిపిస్తున్నప్పుడు.. కొద్ది మొత్తంలో పేస్ట్‌ని స్పాంజ్ సహాయంతో వాటిపైన వృత్తాకారంలో రుద్దాలి. తరువాత ఒక తడి బట్టతో అద్దాలను తుడిస్తే మార్పు మీకే తెలుస్తుంది.
4. పిల్లలు ఉన్న ఇళ్లలో గోడలన్నీ క్రేయాన్ గీతలతో నిండిపోవడం సాధారణం. వాటిని ఎలా పోగొట్టాలి.. అని తల పట్టుకోకండి. వాటిపైన టూత్ పేస్ట్‌ను రాసి ఒక బట్టతో తుడవండి. ఆ తరువాత తడి గుడ్డతో గట్టిగా రుద్దితే చూస్తుండగానే గీతలన్నీ మాయమైపోతాయి.
5. స్నీకర్స్‌కి అడుగున ఉండే రబ్బరు సోల్ మీద తరచూ మరకలు పడుతూనే ఉంటాయి. వాటిని శుభ్రం చేసేందుకు చక్కని సాధనం టూత్ పేస్ట్. పాత టూత్ బ్రష్ మీద కొద్ది పరిమాణంలో పేస్ట్ తీసుకుని దాంతో సోల్ భాగాన్ని రుద్దితే మురికిపోయి తళతళా మెరుస్తాయి.
6. ఐరన్ బాక్స్‌కి పొరపాటున క్లాత్ లాంటివి అంటుకుని మరక పడితే దాని మీద కొద్దిగా పేస్ట్ రాసి ఒక పుల్లతో లేదా గరుగ్గా ఉండే క్లాత్‌తో తుడిస్తే ఆ మరక పోతుంది.