Cauliflower Fried Rice : కాలిఫ్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ ఎంతో రుచిగా ఉంటుంది తెలుసా..? ఇలా చేయాలి..!

Cauliflower Fried Rice : మ‌న‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే ఆహార ప‌దార్థాల్లో క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ ఒక‌టి. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. తిన్నా కొద్ది తినాల‌పించేంత రుచిగా ఉండే ఈ క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని సుల‌వుగా త‌యారు చేసుకోవ‌చ్చు. తేలిక‌గా అయ్యేలా, రుచిగా క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – పావు కేజీ బాస్మ‌తీ బియ్యంతో వండినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ త‌రుగు – పావు క‌ప్పు, బీన్స్ త‌రుగు – పావు క‌ప్పు, క్యాబేజ్ తురుము – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

Cauliflower Fried Rice recipe in telugu very tasty easy to make
Cauliflower Fried Rice

క్యాలీ ప్ల‌వ‌ర్ ఫ్రై త‌యారీ విధానం..

పెద్ద ముక్క‌లుగా త‌రిగిన క్యాలీప్ల‌వ‌ర్ – రెండు క‌ప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, ఉప్పు- త‌గినంత‌, కారం – అర టీ స్పూన్, మైదాపిండి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌పిండి – ఒక టీ స్పూన్, రెడ్ ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ త‌యారీ విధానం..

ముందుగా వేడి నీటిలో క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి ఒక నిమిషం పాటు ఉంచాలి. త‌రువాత వీటిని నీళ్లు లేకుండా తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. త‌రువాత నూనె, నీళ్లు త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత రెండు లేదా మూడు టీ స్పూన్ల నీళ్లు వేసి ముక్క‌లకు పిండి ప‌ట్టేలా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు మ‌ధ్య‌స్థ మంట‌పై వేయించుకుని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత వెడ‌ల్పుగా ఉండే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లతో పాటు మిగిలిన కూర‌గాయ‌ల త‌ర‌గు కూడా వేసి వేయించాలి.

వీటిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకున్న త‌రువాత ముందుగా పొడి పొడిగా చేసుకున్న అన్నం, వేయించిన క్యాలీ ప్ల‌వ‌ర్ ముక్క‌ల‌తో పాటు మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించిన త‌రువాత చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైడ్ రైస్ త‌యార‌వుతుంది. దీనిని నేరుగా లేదా పెరుగు రైతాతో క‌లిపి తిన‌వ‌చ్చు. లంచ్ బాక్స్ లోకి లేదా వీకెండ్స్, స్పెషల్ డేస్ లో క్యాలీప్ల‌వ‌ర్ తో ఇలా ఫ్రైడ్ రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts