Gongura Egg Curry : గోంగూర ఎగ్ క‌ర్రీని ఇలా చేయండి.. అంద‌రికీ నోరూరిస్తుంది..!

Gongura Egg Curry : గోంగూర‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. గోంగూర‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు గోంగూర మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే ఎప్పుడూ ప‌ప్పు, ప‌చ్చ‌డే కాకుండా మ‌నం గోంగూర‌తో గోంగూర కోడిగుడ్డు కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పుల్ల పుల్ల‌గా, కారంగా ఉండే ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే గోంగూర కోడిగుడ్డు కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర ఎగ్ కర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోంగూర – 4 క‌ట్ట‌లు, ప‌ల్లీలు – పావు క‌ప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం – అర ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 3, ప‌చ్చిమిర్చి – 12 నుండి 15, ఉడికించిన కోడిగుడ్లు – 6, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్.

Gongura Egg Curry recipe in telugu everybody likes it
Gongura Egg Curry

గోంగూర ఎగ్ కర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత గోంగూర వేసి క‌ల‌పాలి. గోంగూర మెత్త‌బ‌డి పూర్తిగా ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత ఈ గోంగూర‌ను అలాగే వేయించిన ప‌ల్లీల‌ను, ప‌చ్చిమిర్చి, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులను, అల్లం, వెల్లుల్లిరెబ్బ‌ల‌ను కూడా జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఇందులోనే కొద్దిగా ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత కోడిగుడ్ల‌ను వేసి ఎర్ర‌గా, క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో మ‌రో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి.

త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు స‌గానికి పైగా వేగిన త‌రువాత మిక్సీ పట్టుకున్న గోంగూర వేసి క‌ల‌పాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు వేయించిన కోడిగుడ్లు కూడా వేసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిని క‌లుపుతూ చిన్న మంట‌పై 8 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని వేడి వేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన గోంగూర కోడిగుడ్డు కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ గోంగూర క‌ర్రీని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts