Green Chicken : మనలో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటారు. చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో గ్రీన్ చికెన్ కూడా ఒకటి. గ్రీన్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎక్కువగా ముస్లింల ఫంక్షన్స్ లో కనిపిస్తుంది. ఈ గ్రీన్ చికెన్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా , రుచిగా ఉండే గ్రీన్ చికెన్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి -అర టీ స్పూన్, జీలకర్ర పొడి -ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, యాలకుల పొడి – 2 చిటికెలు, నిమ్మకాయ – 1, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, కర్బూజ గింజలు – ఒక టేబుల్ స్పూన్, బాదం పప్పు – 8, పిస్తా పప్పు – 10, ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, యాలకులు – 4, లవంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, సాజీరా – అర టీ స్పూన్, పుదీనా ఆకులు – ఒక కప్పు, కొత్తిమీర – ఒక చిన్న కట్ట, పచ్చిమిర్చి – 10, పెరుగు- పావు కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, నీళ్లు – అర లీటర్, ఫ్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్.
గ్రీన్ చికెన్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో జీడిపప్పు, పిస్తాపప్పు,బాదంపప్పు, కర్బూజ గింజలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా, ఎండు కొబ్బరి పొడి వేసి రంగు మారే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, పెరుగు, కొత్తిమీర, పుదీనా, అర చెక్క నిమ్మరసంతో పాటు తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత గిన్నెలో చికెన్ తీసుకోవాలి. ఇందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, యాలకుల పొడి, నిమ్మరసం వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత 4 లవంగాలు, 4 యాలకులు, దాల్చిన చెక్క, అర టీ స్పూన్ సాజీరా వేసి వేయించాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత చికెన్ వేసి కలపాలి. దీనిని 4 నిమిషాల పాటు పెద్ద మంటపై ఉడికించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై చికెన్ ను ఉడికించాలి. 5 నిమిషాలకొకసారి కలుపుతూ చికెన్ మెత్తగా ఉడికి నూనె పైకి తేలే వరకు దీనిని ఉడికించాలి. తరువాత ప్రెష్ క్రీమ్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గ్రీన్ చికెన్ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, బగారా అన్నం, పూరీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.