మెనూలో స్పెషల్ బిర్యాని అని ఉండటం చూసి బావుంటుదేమో అని ఆర్డర్ చేశాం. రెస్టారెంట్ వాడు దానికి సిల్వర్ ఫాయిలు, చెర్రీ పళ్ళు, రంగు రంగుల కొబ్బరి కోరు, జీడిపప్పుతో మేకప్పేసి పంపాడు. మరీ ఇంత స్పెషల్ ఊహించలేకపోయాం. టెలీషాపింగ్ భాషలో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాం. కాసేపు ఇది కిళ్లీ యా బిర్యానీయా అని అనుమానం కలిగింది.
ఆ రుచిని వర్ణించడం మా వల్ల కాలేదు. మన ఫుడ్ వ్లాగర్స్ చెప్పినట్టు వేరే లెవల్ ఉంది, కిర్రాక్ ఉంది, పిచ్చి లేషింది, ఇచ్చి పాడేషింది అన్న విశేషణాలు ఉపయోగిస్తూ చివర్లో మహా చెండాలం అనేది చేర్చుకోవాలి. రైతా కనీసం లస్సీలా అయినా ఉంది బ్రతికించాడు.
ఈ వెరీ వెరీ స్పెషల్ పదార్ధాన్ని పంపిన వాడిని ఫోన్ చేసి మరీ అభినందించడానికి ప్రయత్నిస్తే మీకు నచ్చకపోతే అది నా తప్పా..!! చెప్పు సదా..! ఐ డిమాండ్ యాన్ ఎక్స్ప్లనేషన్ యు నో అంటూ ఏడుపు మొదలెట్టేసరికి ఇంకాసేపు ఉంటే మనల్ని కుంభీపాకం గావించి ఏ మండీలోనో, భిండీలోనో పడేస్తాడేమో అనిపించి ఫోన్ కట్ చేసి ఈ స్పెషల్ వంటకం గురించి అందరికీ ఇలా టముకేస్తున్నాను.
అన్నం మధ్యన గుండ్రంగా ఉన్నవి బూరెలు కాదు, గుడ్డు(ఒకటే రెండు ముక్కలు కోసి కప్పెట్టాడు).