Upma : మనం బొంబాయి రవ్వతో రకరకాల పదార్థాలను వండుకుని తింటూ ఉంటాం. బొంబాయి రవ్వతో చేసుకోదగిన వంటకాల్లో ఉప్మా కూడా ఒకటి. ఉప్మాను తయారు చేయడం చాలా తేలిక. దీనిని ఎవరైనా చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. దీనిని మనం అల్పాహారంగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఉప్మాను అందరూ ఇష్టపడి తినేలా రుచిగా, తేలికగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – 100 గ్రా., చిన్నగా తరిగిన టమాట – 1, చిన్నగా తరిగిన క్యారెట్ – 1, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన ఉల్లిపాయ – 1, జీడిపప్పు – రెండు టేబుల్ స్పూన్స్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ.
ఉప్మా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, పల్లీలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఒక కప్పు రవ్వకు మూడు కప్పుల చొప్పున నీటిని పోసుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత కొద్ది కొద్దిగా రవ్వ వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలిపిన తరువాత దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉప్మా తయారవుతుంది. దీనిని పల్లీ చట్నీతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఉప్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.