Kizhi Chicken Biryani : అరటి ఆకుల్లో చికెన్ బిర్యానీ త‌యారీ ఇలా.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..!

Kizhi Chicken Biryani : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే చికెన్ వెరైటీల‌లో బిర్యానీ ఒక‌టి. బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. రెస్టారెంట్ ల‌లో, హోట‌ల్స్ లో మ‌న‌కు చికెన్ బిర్యానీ విరివిరిగా ల‌భిస్తూ ఉంటుంది. మ‌నం ఇంట్లో కూడా అనేక విధాలుగా దీనిని త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే ఈ బిర్యానీని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వెరైటీ బిర్యానీల‌లో కిజీ బిర్యానీ కూడా ఒక‌టి. దీనిని కేర‌ళ‌లో ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. ఈ బిర్యానీని అర‌టి ఆకులో ఉడికిస్తారు. అర‌టి ఆకు ప్లేవ‌ర్ త‌గిలి ఈ బిర్యానీ మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని ఇంట్లో కూడా మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ కిజీ బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కిజీ చికెన్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 4 టేబుల్ స్పూన్స్, యాల‌కులు – 3, న‌ల్ల యాల‌క్కాయ -1, మ‌రాఠీ మొగ్గ – 1, అనాస పువ్వు – 1, ల‌వంగాలు – 5, దాల్చిన చెక్క‌- ఒక ఇంచు ముక్క‌, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన టమాటాలు- 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, బిర్యానీ మ‌సాలా – 2 టీ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, త‌రిగిన పుదీనా – కొద్దిగా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, క‌రివేపాకు -ఒక రెమ్మ‌.

Kizhi Chicken Biryani recipe in telugu make like this
Kizhi Chicken Biryani

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అర‌గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – అరకిలో, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – 5 గ్లాసులు, నూనె -ఒక టీ స్పూన్, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 3, జాప‌త్రి – కొద్దిగా, మ‌రాఠీ మొగ్గ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్.

మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర కిలో, ఉప్పు- ఒక టీ స్పూన్, ప‌సుపు- అర టీ స్పూన్, ధ‌నియాల పొడి -ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పెరుగు – 2 టీ స్పూన్స్.

కిజీ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ లో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి అర గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న త‌రువాత ఈ ముక్క‌ల‌ను నూనెలో వేసి 10 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, బిర్యానీ మ‌సాలా వేసి క‌ల‌పాలి.

త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత వేయించిన చికెన్ ను వేసి క‌ల‌పాలి. తరువాత కొత్తిమీర‌, పుదీనా, నిమ్మ‌ర‌సం, క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. ఈ చికెన్ ను మ‌రో 8 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోయాలి. త‌రువాత బియ్యం త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు వేసి క‌ల‌పాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత బియ్యం వేసి క‌లపాలి. ఈ బియ్యాన్ని 70 శాతం ఉడికించిన త‌రువాత వ‌డ‌క‌ట్టి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు రెండు అర‌టి ఆకుల‌ను తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. త‌రువాత ఒక జ‌ల్లి గిన్నెను తీసుకుని అందులో ఈ అర‌టి ఆకుల‌ను ఒక దాని మీద ఒక‌టి ఉంచాలి. త‌రువాత సిద్దం చేసుకున్న చికెన్ ను ఒక లేయ‌ర్ గా వేసుకోవాలి. త‌రువాత దీనిపై అన్నాన్ని ఒక లేయ‌ర్ గా వేసుకోవాలి. దీనిపై కొద్దిగా కొత్తిమీర‌, పుదీనా, ఫ్రైడ్ ఆనియ‌న్స్ ను చ‌ల్లుకోవాలి. ఇలాగే చికెన్ ను, అన్నాన్ని మ‌రో రెండు లేయ‌ర్స్ లాగా వేసుకోవాలి.

త‌రువాత పైన వేసిన అన్నాన్ని స‌మానంగా చేసుకుని దానిపై కొత్తిమీర‌, పుదీనా, ఫ్రైడ్ ఆనియ‌న్స్ తో పాటు రెండు టీ స్పూన్ల నెయ్యి, వేయించిన జీడిప‌ప్పు, ఫుడ్ క‌ల‌ర్ క‌లిపిన నీళ్లు వేసుకుని తాడుతో అర‌టి ఆకుల‌ను మూట లాగా క‌ట్టాలి. ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక బిర్యానీ మూట‌ను జ‌ల్లి గిన్నెతో స‌హా గిన్నెలో ఉంచి ఆవిరి పోకుండా మూత‌పెట్టాలి. దీనిని ఆవిరి మీద 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ప‌క్కకు తీయాలి. ఇది కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత మూట విప్పి బిర్యానీని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కిజీ బిర్యానీ త‌యార‌వుతుంది. ఈ విధంగా చేసిన కిజీ బిర్యానీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts