Boti Fry : మాంసాహార ప్రియులు అందరూ అనేక రకాల నాన్ వెజ్ వంటకాలను ఇష్టపడుతుంటారు. హోటల్స్‌కు వెళితే భిన్న రకాల వంటలు అందుబాటులో ఉంటాయి. కనుక అప్పుడప్పుడు హోటల్స్‌కు వెళ్తూ తమ జిహ్వా చాపల్యాన్ని తీర్చుకుంటుంటారు. ఇక మనం ఇంట్లోనూ పలు వంటకాలను రెగ్యులర్‌గా వండుతుంటాం. వాటిల్లో బోటి కూడా ఒకటి. దీంతో చాలా మంది కూర చేస్తారు. కానీ బోటి ఫ్రై వాస్తవానికి అద్భుతంగా ఉంటుంది. అన్నీ సరైన పాళ్లలో వేయాలే కానీ బోటి ఫ్రై రుచి అదిరిపోతుంది. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ ఇలాగే చేసుకుంటారు. ఈ క్రమంలోనే బోటి ఫ్రైని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బోటి ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బోటి – అర కిలో, పెరుగు – 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్, కారం – 1 టీస్పూన్, పసుపు – అర టీస్పూన్, గరం మసాలా – 1 టీస్పూన్, జీలకర్ర పొడి – 1 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – ఫ్రై చేసుకోవడానికి కావల్సినంత, కొత్తిమీర (గార్నిష్ కోసం) – కొద్దిగా.
బోటి ఫ్రై తయారీ విధానం..
ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. శుభ్రం చేసి తరిగిన బోటిని అందులో వేసి మళ్లీ కలపాలి. బోటి ముక్కలకు మిశ్రమం బాగా పట్టేలా కలపాలి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి ఫ్రిజ్‌లో 2 గంటల పాటు ఉంచి మ్యారినేట్ చేయాలి. లేదా రాత్రి ఇలా కలిపి పెట్టి ఉదయం వరకు అలాగే ఉంచవచ్చు. దీంతో ముక్కలు మరింత టేస్టీగా ఉంటాయి. ఒక పాన్ లేదా కడాయి తీసుకుని అందులో నూనె పోసి మీడియం మంటపై వేడి చేయాలి. నూనె వేడయ్యాక బోటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేయాలి.
బోటి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో క్రిస్పీగా మారేంత వరకు వేయించాలి. తరువాత వాటిని బయటకు తీసి ప్లేట్‌లో వేసుకోవాలి. ఇలా బోటి మొత్తాన్ని ఫ్రై చేయాలి. అనంతరం దానిపై తరిగిన కొత్తిమీర ఆకులను వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన బోటి ఫ్రై రెడీ అవుతుంది. దీన్ని స్నాక్స్‌గా తినవచ్చు. లేదా నేరుగా అన్నంలో కలిపి తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.