Millets Kadambam : మిల్లెట్ కదంబం.. కొర్రలతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పవచ్చు. అల్పాహారంగా, లంచ్, డిన్నర్ లో భాగంగా ఎప్పుడైనా దీనిని తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కేవలం కొర్రలే కాకుండా ఇతర చిరుధాన్యాలతో కూడా కదంబాన్ని మనం తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే మిల్లెట్ కదంబాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్లెట్ కదంబం తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – రెండున్నర కప్పులు, నానబెట్టిన కొర్రలు – ఒక కప్పు, బఠాణీ – గుప్పెడు, సొరకాయ ముక్కలు – ఒక కప్పు, క్యారెట్ – 1, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ- 1, తరిగిన తోటకూర – ఒక కట్ట, సైంధవ లవణం – తగినంత, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – అర చెక్క.
పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నల్ల శనగలు – 2 టేబుల్ స్పూన్స్, పెసర్లు – 2 టేబుల్ స్పూన్స్, కందిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుకొబ్బరి ముక్కలు – పావు కప్పు, కరివేపాకు – 2 రెమ్మలు, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, మునగాకు – పిడికెడు, ఇంగువ – పావు టీ స్పూన్, శొంఠి – ఒక ఇంచు ముక్క.
మిల్లెట్ కదంబం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నల్ల శనగలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పెసర్లు వేసి వేయించాలి. తరువాత కందిపప్పు, మిరియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుకొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి కరకరలాడే వరకు వేయించాలి. తరువాత నువ్వులు వేసి వేయించాలి. తరువాత దాల్చిన చెక్క, మునగాకు, ఇంగువ, శొంఠి వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి.
నీళ్లు వేడయ్యాక కొర్రలు వేసి ఉడికించాలి. ఇవి సగానికి పైగా ఉడికిన తరువాత బఠాణీ, సొరకాయ ముక్కలు, క్యారెట్, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉడికించాలి. కొర్రలు 80 శాతం ఉడికిన తరువాత తోటకూర, సైంధవ లవణం, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలిపి ఉడికించాలి. కొర్రలు మెత్తగా ఉడికి దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత నెయ్యి, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిల్లెట్ కదంబం తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.