Mutton Curry : మాంసాహారం తినే వారికి మటన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ తో కూరను చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. మటన్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. మటన్ కూరను ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తారు. ఈ మటన్ కూరను గ్రేవీ ఎక్కువగా ఉండేలా రుచిగా వంటరాని వారు కూడా తయారు చేసేంత సులభంగా ఏవిధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ కర్రీ తయారీ విధానం..
మటన్ – ముప్పావు కిలో, నూనె – 5 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, పసుపు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), కారం – 2 టీ స్పూన్స్, నీళ్లు – రెండు గ్లాసులు, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

మటన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా మటన్ ను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత అల్లం పేస్ట్, పసుపు వేసి వేయించాలి. తరువాత మటన్ వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలిపి మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి మూత పెట్టి 6 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికించిన తరువాత మూత తీసి మరలా స్టవ్ మీద ఉంచి మటన్ ను దగ్గర పడే వరకు ఉడికించాలి.
తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, గ్రేవీ ఎక్కువగా ఉండే మటన్ కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా, సంగటి, పూరీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వారు మటన్ కూరను ఈ విధంగా చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.