Paneer Masala Curry : మనం పనీర్ తో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. పనీర్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటుగా వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పనీర్ తో చేసే వంటకాల్లో పనీర్ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అయితే దీనిని తయారు చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, బ్యాచిలర్స్ ఎవరైనా అప్పటికప్పుడు చాలా సులభంగా ఈ కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా, సులభంగా పనీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రౌన్ ఆనియన్స్ – ఒక కప్పు, పచ్చిమిర్చి – 3, వెల్లుల్లి రెమ్మలు – 10, అల్లం – ఒక ఇంచు ముక్క, జీడిపప్పు – 10 నుండి 12, పనీర్ – 200గ్రా., పెరుగు – పావు కప్పు, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం పొడి – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, పనీర్ మసాలా పొడి – ఒక టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పనీర్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా జార్ లో బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, అల్లం, జీడిపప్పు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పనీర్ ను ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్, పెరుగు, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు, పసుపు, పనీర్ మసాలా వేసి కలపాలి. తరువాత దీనిని 5 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న పనీర్ వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత తగినన్ని నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కసూరిమెంతి, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనీర్ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని జీరా రైస్, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా సులభంగా, రుచిగా పనీర్ మసాలా కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు.