Royyala Iguru : మనం రొయ్యలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. రొయ్యలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల ఇగురు కూడా ఒకటి. రొయ్యల ఇగురు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎటువంటి ఘాటైన మసాలాలు లేకుండా చాలా రుచిగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు వేయకుండా రుచిగా రొయ్యల ఇగురును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల ఇగురు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు- 2, యాలకులు – 2, ఉల్లిపాయ ముక్కలు – ముప్పావు కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, శుభ్రం చేసిన రొయ్యలు – అరకిలో, నీళ్లు – పావు కప్పు, కొత్తిమీర – కొద్దిగా, గరం మసాలా – పావు టీ స్పూన్.
మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు..
వెల్లుల్లి రెబ్బలు – 8, ధనియాలు – అర టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, టమాటాలు – పెద్దవి రెండు, కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్స్.
రొయ్యల ఇగురు తయారీ విధానం..
ముందుగా జార్ లో వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో కొత్తిమీర, టమాట ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో లేదా మట్టి గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, దంచుకున్న మిరియాలు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న టమాట పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి. దీనిని బాగా వేయించిన తరువాత రొయ్యలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి రొయ్యలు మెత్తగా ఉడికి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్యల ఇగురు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.