Soya 65 : మీల్ మేకర్ లతో మనం అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మీల్ మేకర్ లతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా మీల్ మేకర్ లతో మనం స్నాక్స్ ను కూడా తయారు చేసి తీసుకోవచ్చు. మీల్ మేకర్ లతో సోయా 65 ని తయారు చేసి తీసుకోవచ్చు. స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. సోయా 65 చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. దీనిని అందరూ ఇష్టపడతారని చెప్పవచ్చు. రుచిగా, క్రిస్పీగా సోయా 65ని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
సోయా 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 3 కప్పులు, మీల్ మేకర్ – ఒకటిన్నర కప్పు, ఉప్పు – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కార్ ఫ్లోర్ – 3 లేదా 4 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
సోయా 65 తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీళ్లు పోసి ఉప్పు వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత మీల్ మేకర్ వేసి 2 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మీల్ మేకర్ లను చేత్తో గట్టిగా పిండి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. నీళ్లు వేయకుండా పిండి కలిసేటట్టు కలుపుకోవాలి. అవసరమైతే ఒకటి లేదారెండు టీ స్పూన్ల నీటిని మాత్రమే వేసుకోవాలి. మీల్ మేకర్ లకు పిండి పట్టేలా కలుపుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మీల్ మేకర్ లను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఇందులోనే కరివేపాకు, గాట్లు పెట్టిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత బయటకు తీసి టిష్యూ ఉన్న గిన్నెలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సోయా 65 తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినడంతో పాటు స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. ఈ సోయా 65ని ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.