Vatti Thunakala Kura : వట్టి తునకలు.. మాంసాన్ని ఎండబెట్టి వరుగులుగా చేసి నిల్వ చేస్తారు.వీటినే వట్టి తునకలు అంటారు. వీటిని పూర్వకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. కానీ ఇప్పటికి వట్టి తునకలను చాలా మంది తయారు చేసి సంవత్సరం పాటు నిల్వ చేసుకుని తింటూ ఉంటారు. మటన్ ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కలుగా కట్ చేసి దారానికి గుచ్చి ఎండలో ఎండబెడతారు. ముక్కలు ఎండిన తరువాత గాలి తగలకుండా నిల్వ చేసి అవసరమైనప్పుడు ఈ ముక్కలను కట్ చేసి కూరచేసుకుని తింటారు. వట్టి తునకల కూరను బాలింతలకు ఎక్కువగా పెడుదూ ఉంటారు. వట్టి తునకలను అలాగే వాటితో కూరను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగాఉండే ఈ వట్టి తునకల కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వట్టి తునకల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ మటన్ – అరకిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 3, తరిగిన పచ్చిమిర్చి – 10, కరివేపాకు – 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 2 నుండి 3 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, వేడి నీళ్లు – 2 కప్పులు, ఎండిన చింతచిరుగు – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వట్టి తునకల కూర తయారీ విధానం..
ముందుగా వట్టి తునకలను తయారు చేసుకోవడానికి గానూ మరీ ముదురుగా, మరీ లేతగా లేని మటన్ ను తీసుకోవాలి. దీనిని శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకున్న తరువాత ఒక టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. తరువాత ఈ మటన్ ను ప్లేట్ పై లేదా వస్త్రంపై,ప్లాస్టిక్ కవర్ పై వేసి ఎండలో ఎండబెట్టాలి. వీటిని వడియాల వలె పూర్తిగా తేమ లేకుండా ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టిన తరువాత వీటిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన వట్టి తునకలను వండే ముందు శుభ్రంగా కడిగి మరుగుతున్న నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. తరువాత కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
ఇవి ఎర్రగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత వట్టి తునకలు వేసి వేయించాలి. వీటిని 5 నుండి 6 నిమిషాల పాటు బాగా వేయించిన తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు బాగా వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి 7 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మటన్ ముదురుది అయితే మరికొద్ది సేపు ఉడికించాలి. ఇలా మటన్ ను ఉడికించిన తరువాత మూత తీసి మరలా స్టవ్ ఆన్ చేసి ఎండిన చింతచిగురు పొడి వేసి కలపాలి. ఇలా చింతచిగురు పొడి అందుబాటులో లేని వారు ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకోవాలి. దీనిని మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వట్టి తునకల కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రాగి సంగటి వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన వట్టి తునకలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.