Cumin Water Benefits : మనం వంటల్లో వాడే దినుసుల్లో జీలకర్ర కూడా ఒకటి. దాదాపు మనం చేసే ప్రతి వంటలోనూ జీలకర్రను వాడుతూ ఉంటాము. జీలకర్ర చక్కటి వాసనను కలిగి ఉంటుంది. ఎంతో కాలంగా వంటల్లో జీలకర్రను ఉపయోగిస్తూ ఉన్నాము. వంటల రుచిని పెంచడంతో పాటు జీలకర్ర మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. జీలకర్రను వాడడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. అయితే వంటల్లో వాడడానికి బదులుగా జీలకర్ర నీటిని తాగడం వల్ల మరిన్ని మంచి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం పరగడుపున జీలకర్ర నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రోజూ ఉదయం పరగడుపున జీలకర్ర నీటిని తాగడం వల్ల మనకు కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కూడా జీలకర్ర నీరు మనకు సహాయపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల అజీర్తి, మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి చాలాసులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖంపై మొటిమలు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా బరువు తగ్గడంలో కూడా జీలకర్ర నీరు దోహదపడుతుంది.
ఈ నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. శరీరంలో ఉన్న కొవ్వు తొలగిపోతుంది. మనం సులభంగా బరువు తగ్గవచ్చు. జీలకర్ర రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమస్యలు తగ్గుతాయి. హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జీలకర్ర నీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం.
దీనికోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచి వడకట్టి గ్లాస్ లో పోసుకోవాలి. ఇందులో రుచి కొరుకు నిమ్మరసం, తేనె కూడా వేసుకోవచ్చు. అలాగే జీలకర్రకు బదులుగా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా జీలకర్ర నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.