Water : మన శరీరానికి రోజూ తగినంత నిద్ర ఎంత అవసరమో.. అలాగే మనం రోజూ తగినన్ని నీళ్లను తాగడం కూడా అంతే అవసరం. నీళ్లను తాగడం వల్ల అనేక జీవక్రియలు సరిగ్గా నిర్వర్తించబడతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరంలోని కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తం శుభ్రమవుతుంది. ఇలా నీటి వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే కొందరు మోతాదుకు మించి అవసరం అయిన దానికన్నా అధికంగా నీటిని తాగుతుంటారు. కానీ ఇలా తాగడం అనర్థదాయకం. దీని వల్ల ఎన్నో దుష్పరిణామాలు కలుగుతాయి. నీళ్లను అధికంగా తాగడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నీళ్లను అధికంగా తాగడం వల్ల మూత్రం తన సహజసిద్ధత్వాన్ని కోల్పోతుంది. మరీ తెల్లగా కనిపిస్తుంది. అలాగే అనవసరంగా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దీంతో మూత్రాశయంపై భారం పడుతుంది. అలాగే నీళ్లను అధికంగా తాగుతారు కనుక కిడ్నీలు కూడా నిరంతరాయంగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో వాటిపై కూడా ఒత్తిడి పడుతుంది. ఇలా సుదీర్ఘకాలంలో జరిగితే కిడ్నీలు చెడిపోయే అవకాశాలు ఉంటాయి.
నీళ్లను ఎక్కువగా తాగితే శరీరంలో ద్రవాల శాతం పెరుగుతుంది. దీంతో శరీరం వాపులకు గురవుతుంది. అలాగే విరేచనాలు, వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక నీళ్లను అధికంగా తాగడం వల్ల శరరీంలో సోడియం స్థాయిలు అదుపుతప్పుతాయి. దీంతో కండరాలు బలహీనంగా మారుతాయి. ఫలితంగా తీవ్రమైన అలసట, నీరసం వస్తాయి. కాస్త పనిచేసినా బాగా అలసిపోయినట్లు మారుతారు. ఇది మరింత అనర్థాలకు దారి తీస్తుంది. కనుక నీళ్లను తగిన మోతాదులోనే తాగాల్సి ఉంటుంది.
మహిళలు అయితే రోజుకు 2.7 లీటర్ల నీటిని తాగాలి. అదే పురుషులు అయితే రోజుకు 3.7 లీటర్ల నీళ్లను తాగాల్సి ఉంటుంది. కానీ వారు జీవించే పరిస్థితులు, ఉంటున్న వాతావరణం, వారికి ఉండే వ్యాధులు.. వంటి అంశాల కారణంగా రోజుకు తాగాల్సిన నీళ్ల పరిమాణం మారుతుంది. అయితే ఎవరైనా సరే కనీసం 2.5 నుంచి 3.0 లీటర్ల మేర నీటిని రోజుకు తాగితే మంచిది. అంతకన్నా తక్కువైనా, ఎక్కువైనా అనర్థాలు సంభవిస్తాయి. కనుక నీళ్లను మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా కూడా తాగరాదు. నీళ్లను తగిన మోతాదులో తాగితేనే ఆరోగ్యంగా ఉంటారు.