Barley Water : వేసవి కాలంలో చాలా మంది వేసవి తాపం నుండి బయట పడడానికి శీతల పానీయాలను, చల్లగా ఉండే ఇతర పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. అయితే శీతల పానీయాలను తాగడం వల్ల శరీరం చల్లబడినప్పటికి వీటిని తాగడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కనుక వేసవికాలంలో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వేసవికాలంలో శరీరానికి హానిని కలిగించకుండా శరీరాన్ని చల్లబరిచే పదార్థాలను తీసుకోవడం మంచిది. శరీరాన్ని చల్లబరిచే పదార్థాల్లో బార్లీ నీళ్లు కూడా ఒకటి. బార్లీ గింజలు.. ఇవి మనందరికి తెలిసినవే. ఎక్కువగా వీటితో కిచిడీ, సలాడ్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. అలాగే కొందరు వీటిని పిండిగాచేసి చపాతీ పిండిలో కలుపుకుని చపాతీలు కూడా తయారు చేస్తారు.
ఇవే కాకుండా బార్లీ గింజలతో మనం బార్లీ నీటిని కూడా తయారు చేసుకోవచ్చు. బార్లీ నీళ్లు తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. అలాగే ఈ నీటిని తాగడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బార్లీ నీటిని ఎలా తయారు చేసుకోవాలి…అలాగే ఈ నీటిని తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నీటిని తయారు చేసుకోవడానికి గానూ ముందు ఒక గిన్నెలో ఒకటిన్నర లీటర్ల నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో ఒక కప్పు బార్లీ గింజలను వేసి 20 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని చల్లారనివ్వాలి. నీళ్లు చల్లారిన తరువాత వాటిని వడకట్టుకుని అందులో రుచి కొరకు తేనె, నిమ్మరసం లేదా ఉప్పును కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న నీటిని సాధారణ నీటిలా రోజంతా తాగవచ్చు.
ఈ విధంగా ఈ నీటిని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బార్లీ గింజల్లో ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. ఈ నీటిని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఎండకాలంలో వీటిని తాగడం వల్ల మనం మంచి ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఈ నీటిని తాగడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గు ముఖం పడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక బరువుతో బాధపడే వారు ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.
అలాగే ఈ నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పిత్తాశయంలో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఈ నీటిని తాగడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఎముకలు ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే ఈ నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గ్యాస్, మలబద్దకం , అజీర్తి వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా బార్లీ నీటిని తీసుకోవడం వల్ల ఎండ నుండి ఉపశమనాన్ని పొందడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అయితే ఈ నీటిని కేవలం వేసవికాలంలోనే కాకుండా ఎప్పుడైనా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.