Dosakaya Tomato Curry : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో దోసకాయ కూడా ఒకటి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేయడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దోసకాయతో మనం కూర, పులుసు, పప్పు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. దోసకాయ, టమాటాలు కలిపి చేసే దోసకాయ టమాట కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎటువంటి మసాలాలు వేయకుండా కూడా ఈ కూరను సులభంగా తయారు చేసుకోవచ్చు. మసాలాలు వేయకుండా దోసకాయ టమాట కర్రీని రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ టమాట కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన దోసకాయ – పావు కిలో, తరిగిన చిన్న టమాటాలు – 2, తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు- ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
దోసకాయ టమాట కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత దోసకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి దోసకాయ ముక్కలను మగ్గించాలి. దోసకాయ ముక్కలు ఉడికిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత వీటిపై మరలా మూతను ఉంచి టమాట ముక్కలను మెత్తగా ఉడికించాలి. తరువాత ఇందులో కారం వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ టమాట కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దోసకాయతో ఈ విధంగా కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.