Best Time To Drink Water : మన శరీరానికి ఆహారం, గాలి, నిద్ర ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. శరీరాన్ని హైడ్రెటెడ్ గా ఉంచడంలో, శరీరం తన విధులను సక్రమంగా నిర్వర్తించేలా చేయడంలో నీరు ఎంతో అవసరమవుతుంది. శరీరం హైడ్రెటెడ్ గా ఉండాలంటే మనం రోజుకు 4 నుండి 5 లీటర్ల నీటిని తాగడం చాలా అవసరం. సాధారణంగా దాహం వేసినప్పుడు, ఆహారం తీసుకునేటప్పుడు నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పే సమయాల్లో నీటిని తాగడం వల్ల శరీరానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి మరింత మేలు కలగాలంటే నీటిని ఏయే సమయాల్లో తీసుకుంటే మంచిదో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నిద్రలేచిన తరువాత నీటిని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఉదయం పూట నీటిని తాగడం వల్ల శరీరం హైడ్రెటెడ్ గా ఉంటుంది.
శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో వ్యర్థాలు బయటకు పోతాయి. మనం చురుకుగా పని చేసుకోవచ్చు. అలాగే భోజనానికి అరగంట ముందు నీటిని తీసుకోవడం చాలా మంచిది. ఇలా భోజనానికి అరగంట ముందు నీటిని తీసుకోవడం వల్ల ఆహారం తీసుకోవడానికి పొట్ట సిద్దంగా ఉంటుంది. అంతేకాకుండా నీటిని తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. మనం ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకుండా ఉంటాము. అదేవిధంగా భోజనాల మధ్య నీటిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రెటెడ్ గా ఉంటుంది. శరీరంలో ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. శరీరంలో పోషకాల రవాణాలో నీరు ఎంతగానో సహాయపడుతుంది. ఈ సమయంలో సాధారణ నీరు లేదా మూలికలతో లేదా నిమ్మజాతికి చెందిన పండ్ల నీటిని తీసుకోవడం మంచిది. అదే విధంగా వ్యాయామం చేసేటప్పుడు నీటిని తాగడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
వ్యాయామం చేసేటప్పుడు నీటిని తాగటం వలన కండరాల అలసట, కండరాల తిమ్మిర్లు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్ లు తిరిగి అందుతాయి. అదే విధంగా పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిని తాగడం వల్ల రాత్రిపూట నిర్జలీకరణాన్ని నివారించవచ్చు. అయితే చాలా మంది రాత్రి పూట నీటిని తాగితే మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందని భావిస్తారు. కనుక రాత్రి పూట నిద్రకు అంతరాయం కలగకుండా ఉండడానికి గానూ తక్కువ మొత్తంలో నీటిని తీసుకోవడం మంచిది. ఇలా నీటిని తీసుకుంటూనే దాహం వేసినప్పుడు కూడా నీటిని తాగాలి. దాహం శరీరంలో నిర్జలీకరణాన్ని సూచిస్తుంది. కనుక దాహం వేసినప్పుడు నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ విధంగా రోజూ తగిన మొత్తంలో తగిన సమయంలో శుభ్రమైన నీటిని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.