Bread Chilli : మనం బ్రెడ్ తో రకరకాల స్నాక్స్ ను తయారు చేసుకుని తింటూ ఉంటాము. బ్రెడ్ తో చేసే స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసుకోదగిన వెరైటీ స్నాక్ ఐటమ్స్ లో బ్రెడ్ చిల్లీ కూడా ఒకటి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని చాలా సులభంగా 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఫాస్ట్ ఫుడ్ తినే పిల్లలకు ఇది ఎంతగానో నచ్చుతుందని చెప్పవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ బ్రెడ్ చిల్లీని ఎలా తయారు చేసుకోవాలో… ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ చిల్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసెస్ – 5, నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెమ్మలు – 2, అల్లం పొడి – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – చిన్నది ఒకటి, క్యూబ్స్ లాగా తరిగిన క్యాప్సికం – చిన్నది ఒకటి, సోయా సాస్ – ఒక టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, టమాట కిచప్ – ఒకటిన్నర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్.
బ్రెడ్ చిల్లీ తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని వాటి అంచులను తీసివేయాలి. తరువాత వాటిని ఒకేలా ఉండేలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బ్రెడ్ ముక్కలను వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి తరుగు, అల్లం పొడి వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాట కిచప్ వేసి కలపాలి. తరువాత గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి చిక్కబడే వరకు ఉడికించాలి. తరువాత ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత వేయించిన బ్రెడ్ ముక్కలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ చిల్లీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.