Rasam Vada : మనం ఉదయం అల్పాహారంగా రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే అల్పాహారాల్లో వడలు ఒకటి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద కూడా వడలు లభిస్తూ ఉంటాయి. ఈ వడలను మనం ఎక్కువగా చట్నీతో తింటూ ఉంటాం. కేవలం చట్నీనే కాకుండా మనం రసం తయారు చేసుకుని ఈ వడలను తినవచ్చు. రసంలో వేసుకుని తింటే ఈ వడలు మరింత రుచిగా ఉంటాయి. వడలను అలాగే వీటిని తినడానికి రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రసం వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక కప్పు, పచ్చిమిర్చి – 2, అల్లం – అర ఇంచు ముక్క, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, జీలకర్ర – అర టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.

రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం ముక్క – అర ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెబ్బ, మిరియాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 1, ఇంగువ – పావు టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, తరిగిన టమాటాలు – 2, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, నీళ్లు – రెండున్నర గ్లాసులు, ఉడికించిన పెసరపప్పు – పావు కప్పు, కారం – ఒక టీ స్పూన్, సాంబార్ పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
రసం వడ తయారీ విధానం..
ముందుగా మినపప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత పప్పును జార్ లోకి తీసుకుని టీ స్పూన్ల నీళ్లు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, జీలకర్ర, వంటసోడా, కొత్తిమీర వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర వేసి బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో టమాట ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట పేస్ట్, చింతపండు రసం వేసి కలపాలి. ఇందులోనే నీళ్లు, ఉప్పు, కారం, సాంబార్ పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. ఈ రసాన్ని ఒక పొంగు వచ్చే వరకు మరిగించిన తరువాత ఉడికించిన పెసరపప్పు వేసి కలపాలి. దీనిని మరో పోఒంగు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రసం తయారవుతుంది. ఇప్పుడు కళాయిలో డీప్ ఫ్రైకు సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వడల ఆకారంలో వత్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇప్పుడు గిన్నెలో ముందుగా తయారు చేసుకున్న రసాన్ని తీసుకోవాలి. తరువాత అందులో వడలను వేసి వడలు నానిన తరువాత తినాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రసం వడలు తయారవుతాయి. ఈ రసం వడలు చాలా రుచిగా ఉంటాయి. తరచూ చట్నీలతోనే కాకుండా ఈ విధంగా కూడా రసం వడలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.