నేటి రోజుల్లో పురుషులలోను, స్త్రీలలోను చాలామందికి బాన పొట్టలు వచ్చేస్తున్నాయి. దీనికి కారణం నగర జీవన విధానం. రాత్రి పొద్దుపోయేటంత వరకు టీ.వీ.లు చూస్తూ కాలక్షేపాలు చేసి డిన్నర్ మరింత లేట్ గా చేసి వెంటనే పడకమీదికెక్కి గుర్రు పెట్టేస్తారు. ఈ విధంగా భోజనం చేసిన వెంటనే నిద్రించరాదని, కనీసం కొద్దిపాటి దూరమైనా నడవాలని, ఆహారం తీసుకున్న రెండు లేదా మూడు గంటల తర్వాత మాత్రమే నిద్రించాలని, ఈ సమయం ఆహారం బాగా జీర్ణమయ్యేటందుకు తోడ్పడుతుందని శరీర అవయవాలకు మంచి వ్యాయామంగా కూడా వుంటుందని పోషకాహార నిపుణులు చెపుతున్నారు.
అయితే, రాత్రి ఆహారం తర్వాత నడిచే నడక వేగవంతంగా వుండరాదుట. రాత్రి భోజనం తర్వాత వెంటనే గుర్రు పెట్టి పడుకోకుండా వెల్లకిలా, ఎడమవైపు, ఆతర్వాత కుడివైపు తిరిగి పడుకొని ప్రతి భంగిమలో కొద్ది సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తే, జీర్ణ వ్యవస్ధకు అది సహకరిస్తుందని ఆ తర్వాత ఎలా కావాలంటే అలా పడుకోవచ్చని బొడ్డు భాగంలో ఎడమవైపు జీర్ణకోశం వుంటుంది కనుక తిన్న ఆహారం బాగా జీర్ణమవడం ఈ ప్రక్రియతో జరుగుతుందని చెపుతారు. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఎనిమిది ఉశ్వాస, నిశ్వాసములు కలిగే వరకూ వెల్లకిలా పడుకోవాలి. తర్వాత 16 ఉశ్వాస, నిశ్వాసాలు వచ్చేవరకూ కుడిప్రక్కకు తిరిగి పడుకోవాలి. ఆ తర్వాత 32 ఉశ్వాస, నిశ్వాసాలు కలిగే వరకూ ఎడమవైపుకి తిరిగి పడుకోవాలి. ఆ తర్వాత ఎలా నిద్రపడితే అలా పడుకోవచ్చు.
నాభిపైన ఎడమవైపు జఠరాగ్ని ఉంటుంది కనుక తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవడం జరుగుతుంది.నిద్రించే ప్రదేశంలో మంచి సహజమైన గాలి కూడా వుంటే, శ్వాస క్రియ బాగా సమర్ధవంతంగా కూడా వుంటుందని దానితో తిన్న ఆహారం బాగా జీర్ణమై పొట్టలో కొవ్వుగా మారదని నిపుణులు వెల్లడిచేశారు.