Salt : మనం వంటల్లో రుచి కొరకు ఉపయోగించే వాటిల్లో ఉప్పు కూడా ఒకటి. దీనిని లవణం అని కూడా అంటారు. ఈ లవణం భూమి మీద జంతువుల మనుగడకు ఎంతో అవసరం. ఇది షడ్రుచుల్లో ఒకటి. ఉప్పులో అధికంగా ఉండే రసాయనం సోడియం. మనం తయారు చేసే ఆహార పదార్థాలకు ఇది చక్కటి రుచిని ఇస్తుంది. మన భారతీయ వంటకాల్లో ఉప్పుకు ప్రధాన పాత్ర ఉంది. ఆహార పదార్థాలను భద్రపరచడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటాం. పచ్చళ్లను, చేపలను ఎక్కువకాలం నిల్వ ఉంచడానికి ఉప్పును విరివిరిగా వాడతారు. అలాగే ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది.
ప్రతిరోజూ సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పును వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ మోతాదు జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు కంటే చాలా ఎక్కువ. రోజుకు 6 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు, కడుపులో క్యాన్సర్, ఆస్టియోపోరోసిస్, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు 6 గ్రాముల ఉప్పు కంటే చిటికెడు ఉప్పును ఎక్కువగా తీసుకున్నా కూడా ముప్పు వాటిల్లుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అసలు ఉప్పు వాడకం 2.6 గ్రాముల నుండి 4 గ్రాముల కంటే మించకూడదని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. సాధారణంగా భారతీయుల కుటుంబాల్లో పది గ్రాముల ఉప్పు వాడతారని ఒక అంచనా. సముద్రం నుండి లభించే ఉప్పులో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్ ఉంటాయి. మన శరీరంలో జరిగే రసాయనికి చర్యలన్నీ కూడా ఉప్పు మీదే ఆధారపడి ఉంటాయి.
కండరాలు సంకోచించకుండా నీటిని నిల్వ ఉంచడంలో ఉప్పు సహాయపడుతుంది. శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఉప్పు దోహదపడుతుంది. శరీరంలో ఆమ్ల, క్షార నిష్పత్తులను క్రమబద్దీకరించడంలో ఉప్పు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శరీరంలో సోడియం తక్కువైతే మనిషి త్వరగా అలసటకు గురి కావడం, నీరసించడం, చిరాకు పడడం వంటి సమస్యలు వస్తాయి.
మనం రోజుకు 6 గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలి. కానీ ఒక వ్యక్తి సగటున 8 నుండి 10 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నాడని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. స్థూలకాయులు ఉప్పును ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్న వారు ఉప్పును ఎక్కువగా తింటే మూత్ర పిండాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పును అధికంగా వాడి ఆరోగ్యానికి చేటు తెచ్చుకోకుండా తగిన మోతాదులో తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.