మనం రోజూ వెల్లుల్లిని అనేక వంటల్లో వేస్తుంటాం. వెల్లుల్లి వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. వెల్లుల్లిలో అనేక పోషకాలు ఉంటాయి. ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల వెల్లుల్లి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందాలంటే వెల్లుల్లిని ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు వెల్లుల్లి రెబ్బలను నేరుగా అలాగే నమిలి తినవచ్చు. లేదా వాటి రసం తాగవచ్చు. అలా కూడా తినలేమని అనుకుంటే వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకుని కాల్చి తినవచ్చు. పెనంపై కొద్దిగా నెయ్యి వేసి వేయించి తినవచ్చు. లేదా వెల్లుల్లి రెబ్బలు 2 తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు 2 సార్లు కప్పు మోతాదులో తాగవచ్చు. ఈ విధంగా పలు రకాలుగా వెల్లుల్లిని తీసుకోవచ్చు. ఇక వెల్లుల్లి ట్యాబ్లెట్లు కూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. వాటిని ఉదయం, సాయంత్రం భోజనం అనంతరం ఒక్కటి చొప్పున 250 మి.గ్రా. మోతాదులో తీసుకోవాలి. ఇలా వెల్లుల్లిని తీసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
వెల్లుల్లిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి. హైబీపీ తగ్గుతంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది.
వెల్లుల్లిని తీసుకుంటే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది.
వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ జబ్బులు ఉన్నవారు వెల్లుల్లిని తింటే ఎంతో మేలు జరుగుతుంది.
వెల్లుల్లిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.