Cholesterol : ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న వయస్సులోనే గుండె జబ్బుల బారిన పడడానికి, హార్ట్ ఎటాక్ లతో మరణించడానికి శరీరంలో పేరుకు పోయే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) ను ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రపంచ దేశాల కంటే భారతదేశంలోనే గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. కార్బొహైడ్రేట్స్ కలిగిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం, జ్యూస్ లను అధికంగా తాగక పోవడం, సలాడ్స్, నట్స్ వంటి వాటిని తినక పోవడం, అధికంగా కూరలను తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల రక్త నాళాలలో చెడు కొవ్వు అధికంగా పేరుకుపోతోంది. దీని వల్ల రక్త నాళాలలో పూడికలు ఏర్పడి గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మన శరీరానికి ఇతర పోషకాల మాదిరిగా కొలెస్ట్రాల్ కూడా అవసరమే. అది ప్రతి రోజూ 300 మిల్లీ గ్రాముల మేర అయితే మన శరీరానికి సరిపోతుంది. పైత్యరసాన్ని ఉత్పత్తి చేయడానికి, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి, శరీరం విటమిన్ డి ని తయారు చేసుకోవడానికి మన శరీరానికి కొలెస్ట్రాల్ అవసరమవుతుంది. మనకు రోజూ అవసరమయ్యే కొలెస్ట్రాల్ ను మన శరీరంలో ఉండే కాలేయం తయారు చేస్తుంది. దీని వల్ల మన శరీరంలో ఎటువంటి కొలెస్ట్రాల్ పేరుకు పోదు. కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను మనం తినడం వల్ల వీటిలో ఉండే కొవ్వు రక్త నాళాలలో పేరుకుపోయి పూడికలు ఏర్పడతాయి. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) శాతం 100 లోపే ఉండాలి. జంతు సంబంధమైన ఉత్పత్తులు అయిన పాలు, పెరుగు, మాంసం, గుడ్లు, చేపలు, రొయ్యలలో కొవ్వు అధికంగా ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవడంతోపాటు, ఎక్కువగా కార్బొహైడ్రేట్స్ కలిగిన ఆహార పదార్థాలను, నూనెను కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వీటిలో ఉండే కొవ్వు కాలేయంలోకి చేరుతుంది. కాలేయం వీటిని కొలెస్ట్రాల్ గా మార్చి రక్తంలో కలిసేలా చేస్తుంది. ఇలా రక్తంలో కలిసిన కొలెస్ట్రాల్ రక్తనాళాలలో ఉండే పొర దెబ్బతిన్న చోట పేరుకుపోతుంది.
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కాలేయం ఎక్కువగా కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేయకుండా ఉండేలా చేయాలి. దీని కోసం ఫైబర్ అధికంగా, కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఉదయం పూట కూరగాయల జ్యూస్, సాయంత్రం పూట పండ్ల జ్యూస్ లను, పండ్లను మాత్రమే తీసుకోవాలి. అలాగే ఇడ్లీ, దోశ వంటి వాటిని తినకుండా మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల కాలేయం అధికంగా కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేయకుండా ఉంటుంది. మధ్యాహ్నం పూట పుల్కాలను ఎక్కువ కూరతో తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అన్నాన్ని, మాంసాన్ని, నూనె పదార్థాలను తక్కువగా తీసుకుంటూ ఫైబర్ ను అధికంగా కలిగి ఉండే ఆకుకూరలను, పండ్లను, మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. హార్ట్ ఎటాక్‌ల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.