Bread : నిత్యం మనం అనేక రకాల ఆహారాలను తింటుంటాం. కానీ కొన్ని ఆహారాలు మనకు హాని చేస్తాయి. వాటి గురించి చాలా మందికి పూర్తిగా తెలియదు. అలాంటి ఆహారాల్లో వైట్ బ్రెడ్ ఒకటి. ఇది నిజానికి ఆరోగ్యకరమైందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది మన శరీరానికి మంచిది కాదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
వైట్ బ్రెడ్‌ను గోధుమ పిండితో తయారు చేస్తారు. కానీ ఆ పిండిని బాగా శుభ్రం చేస్తారు. దీంతో అందులో ఉండే విటమిన్లు, మినరల్స్ ను నష్టపోతాం. ఇక ఆ బ్రెడ్‌లో పోషకాలు ఏమీ ఉండవు. అందువల్ల దాన్ని తిన్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా అనారోగ్య సమస్యలు వస్తాయి.
వైట్ బ్రెడ్ తయారీకి ఉపయోగించే పిండిని ప్రాసెస్ చేసేందుకు పొటాషియం బ్రోమేట్, అజోడికార్బొనమైడ్, క్లోరిన్ డయాక్సైడ్ వంటి కెమికల్స్ ను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో అలాంటి పిండితో తయారు చేసిన బ్రెడ్‌ను తింటే స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. బ్రెడ్ ఎక్కువ సమయం పాటు తాజాగా ఉండేందుకు అందులో ప్రిజర్వేటివ్స్ ను కూడా కలుపుతారు.
వైట్ బ్రెడ్‌ను తినడం వల్ల అధికంగా బరువు పెరుగుతారు. అందులో గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ బ్రెడ్‌ను తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచిది కాదు. పైగా ఆ సమస్య లేని వారికి డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
వైట్ బ్రెడ్‌ను తింటే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే ఆ బ్రెడ్ తయారీకి వాడే పిండిలో ఫైబర్ అసలే ఉండదు. ఇది జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. అందువల్ల వైట్ బ్రెడ్‌ను తినరాదు. దానికి బదులుగా బ్రౌన్ బ్రెడ్ లేదా హోల్ గ్రెయిన్ బ్రెడ్‌లను తీసుకోవచ్చు. వాటిల్లో విటమిన్లు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బ్రౌన్ బ్రెడ్‌లో ఐరన్, జింక్, కాపర్, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి. అవి మనకు పోషణను అందించడంతోపాటు అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి. కనుక వైట్ బ్రెడ్‌కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ లేదా హోల్ గ్రెయిన్ బ్రెడ్‌లను తింటే మంచిది.