Sleep : ప్రస్తుత కాలంలో ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అనారోగ్యాల బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో శరీరానికి తగినంత నిద్రలేకపోవడం కూడా ఒకటి. మన శరీరానికి శక్తిని ఇవ్వడంలో ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. నిద్ర కూడా అంతే ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. నిద్రలేమి కారణంగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడతామని నిపుణులు చెబుతున్నారు. మన రోజూవారి జీవితంలో మన పనులకు ఎలా సమయాన్ని కేటాయిస్తామో.. నిద్ర పోవడానికి కూడా సమయాన్ని అదే విధంగా కేటాయించాలని చెబుతున్నారు.
మనం రోజూ ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలని అప్పుడే మనం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. కానీ ప్రస్తుత కాలంలో పడుకోగానే నిద్ర రావాలంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలని భావించే పరిస్థితి నెలకొంది. కారణాలు ఏమైనప్పటికీ మన శరీరానికి తగినంత నిద్ర చాలా అవసరం. కొన్ని రకాల చిట్కాలను ఉపయోగించి నిద్రలేమి సమస్య నుండి బయట పడవచ్చు. చక్కగా నిద్రపోవడానికి ఉపయోగపడే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మంది టీ, కాఫీలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. అతిగా వీటిని తాగడం వల్ల కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. కనుక వీటిని తాగడం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. శరీరానికి తగినంత శారీరక శ్రమ చేయడం వల్ల కూడా నిద్ర తొందరగా పడుతుంది. రాత్రి త్వరగా నిద్ర పట్టాలంటే ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో నిద్రించకూడదు. శరీరం తేలికై నిద్ర సులువుగా పట్టడంలో ప్రాణాయామం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పడుకునే ముందు ప్రాణాయామం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
చక్కని సంగీతాన్ని వింటూ ఉంటే కూడా చాలా సులువుగా నిద్రలోకి జారుకుంటారు. మానసిక ఒత్తిడి కారణంగా కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే పడుకునే ముందు వేడి నీటితో స్నానం చేయడం వల్ల కూడా నిద్ర సులువుగా పడుతుంది. గోరు వెచ్చని కొబ్బరి నూనెతో మర్దనా చేయడం వల్ల తలకు రక్తప్రసరణ బాగా జరిగి చక్కగా నిద్రపోతారు.
సాయంత్రం సమయంలో అతిగా భోజనం చేయడం వల్ల కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. కనుక సాయంత్రం భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అదే విధంగా ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి. అలాగే నిద్ర మేల్కొనే సమయం కూడా ఒకటే ఉండాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గి చక్కని నిద్రను సొంతం చేసుకోవచ్చు. దీంతో నిద్రలేమి కారణంగా వచ్చే అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాం.