Diet : మన శరీరం తన విధులను తను సక్రమంగా నిర్వర్తించాలంటే అనేక పోషకాలు అవసరమవుతాయి. పోషకాలల్లో స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని రెండు రకాలు ఉంటాయి. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలను స్థూల పోషకాలనీ, విటమిన్స్, మినరల్స్ వంటి వాటిని సూక్ష్మ పోషకాలనీ అంటారు. ముఖ్యంగా మన శరీరానికి విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు చాలా అవసరమవుతాయి. కానీ 100 లో 75 శాతం మంది ఈ పోషకాల లోపంతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మనలో చాలా మంది తీసుకోవాల్సిన పోషకాలను తక్కువగా తీసుకోవడంతో పాటు తీసుకోకూడని కొవ్వు పదార్థాలను, పిండి పదార్థాలను అవసరమైన దాని కంటే ఎక్కువగా తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. పిండి పదార్థాలను, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడి జీవితాంతం బాధపడాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా పోషకాలు మన శరీరానికి ఇంత మోతాదులో అవసరమవుతాయని చెప్పవచ్చు. కానీ పిండి పదార్థాలు ఎంత అవసరమవుతాయో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. మనం చేసే పని, మన వయసు, మన శరీర అవసరాన్ని బట్టి వీటిని తీసుకునే మోతాదు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. మనలో చాలా మంది మన శరీర అవసరాన్ని బట్టి కాకుండా అధిక మోతాదులో పిండి పదార్థాలను తీసుకుంటున్నారు. పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖ్యంగా షుగర్ వ్యాధి బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ రావడానికి మొదటి కారణం పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడమేనని వారు తెలియజేస్తున్నారు. అలాగే పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల స్థూలకాయం, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ ఎక్కువగా పేరుకుపోవడం, ఫ్యాటీ లివర్, శరీరంలో ఇన్ ప్లామేషన్ పెరగడం వంటి అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
కనుక మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. పిండి పదార్థాలు ఎక్కువగా చిరుధాన్యాలల్లో ఉంటాయి. దాదాపుగా చిరుధాన్యాల్లో 70 శాతం పిండి పదార్థాలే ఉంటాయి. అలాగే కూరగాయలల్లో 4 శాతం, ఆకుకూరలల్లో 8 శాతం, పండ్లల్లో 10 నుండి 12 శాతం, దుంపల్లో 15 నుండి 20 శాతం, విత్తనాల్లో 15 నుండి 25 శాతం వరకు పిండి పదార్థాలు ఉంటాయి. మన శరీరానికి, మనం చేసే పనికి తగినట్టు మన ఆహారంలో పిండి పదార్థాలు ఉండేలా చూసుకోవాలని అప్పుడే మనం ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. పిండి పదార్థాల మోతాదు శరీరంలో ఎక్కువైతే అనార్థాలే తప్ప మనకు ఎటువంటి లాభం ఉండదని కనుక తగిన మోతాదులో మాత్రమే వీటిని తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.