తేనె, నిమ్మురసంలలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. తేనెను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. తేనెను పలు ఔషధాలతోపాటుగా తీసుకుంటారు. తేనె వల్ల ఔషధాలు శరీరానికి చక్కగా అందుతాయట. దీంతో వ్యాధి త్వరగా తగ్గుముఖం పడుతుందట. ఇక నిమ్మరసంలోనూ అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని కూడా పలు ఔషధాల తయారీలో వాడుతారు. అయితే రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె, నిమ్మరసం కలిపి తాగితే ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. దీని వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె, నిమ్మరసంలలో అద్భుతమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ మిశ్రమం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కణాలను రక్షిస్తుంది. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తుంది. దీంతోపాటు ఇమ్యూనిటీని సైతం పెంచి రోగాలు రాకుండా చూస్తుంది. అలాగే ఈ మిశ్రమాన్ని సేవించడం వల్ల చర్మం కూడా కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఆరోగ్యంగా ఉంటుంది. కనుక తేనె, నిమ్మరసం మిశ్రమాన్ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు రోజూ ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల ఫలితం ఉంటుంది. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో కడుపు ఉబ్బరం, మలబద్దకం, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. రోజంతా బిజీగా గడిపేవారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
తేనె, నిమ్మరసం మిశ్రమాన్ని తాగడం వల్ల శరీరంలోని శక్తిస్థాయిలు పెరుగుతాయి. దీంతో రోజంతా చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అలసట, నీరసం తగ్గుతాయి. ఇలా ఈ మిశ్రమంతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక రోజూ దీన్ని తాగడం మరిచిపోకండి.