Sweat : వేసవిలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టేది చెమట. అది పెట్టే చికాకు అంతా ఇంతా కాదు. చెమటతో కొన్ని సందర్భాల్లో నలుగురిలో తల ఎత్తుకోలేని పరిస్థితి నెలకొంటుంది. చెమట వాసనతో నలుగురితో కలవాలంటే జంకు, ఎవరి దగ్గరికైనా వెళ్లాలన్నా భయం కలుగుతుంది. వేసవిలో చిన్నా పెద్దా అందరూ చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చెమటతో వచ్చే దుర్గంధం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు డాక్టర్లు.
చంకలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డియోడరెంట్లకు బదులు సమ్మర్ లో యాంటి పెరిస్పెరెంట్ వాడాలి. ఘాటు వాసన వచ్చే ఆహార పదార్థాలు తినడం మానేయాలి. తేలికపాటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ప్రతి అరగంటకు ఒకసారి మంచి నీరు ఎక్కువగా తాగాలి. రెండు పూటలా స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు డెటాల్, యుడుకోలోన్, రోజ్‌వాటర్ వీటిలో ఏదైనా కొన్ని చుక్కలు కలుపుకొని స్నానం చేయాలి. ఎండాకాలంలో కాటన్ దుస్తులనే వాడాలి. అది కూడా పలుచని బట్టలనే వాడాలి. సింథటిక్ బట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇవి చెమటను మరింత ఎక్కువగా వచ్చేలా చేస్తాయి.
చిన్న పసుపు ముక్కను పేస్ట్‌లా రుబ్బుకొని శరీరానికి రాసి స్నానం చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది. దుర్వాసన మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. సగం నిమ్మకాయని తీసుకుని చెమట ఎక్కువగా పట్టే చోట బాగా రుద్దాలి. తరువాత శుభ్రంగా స్నానం చేయాలి. ఇది రోజుకు ఒక్కసారైనా తప్పకుండా చేయాలి. నాలుగు టమాటాలు తీసుకుని పేస్టులా చేసి దాన్ని వడకట్టి జ్యూస్ విడిగా తీయాలి. ఆ జ్యూస్ ని ఒక బకెట్ నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేస్తే శరీర దుర్వాసన తగ్గించుకోవచ్చు. ఇది స్వేద గ్రంథులను ముడుచుకునేలా చేసి తక్కువ చెమట పట్టేలా చేస్తుంది.
కొన్ని పుదీనా ఆకులును ఒక బకెట్ నీటిలో కలిపి స్నానం చేస్తే ఆ రోజంతా చర్మం తాజాగా ఉంటుంది. టేబుల్ స్పూన్ వంట సోడా, టేబుల్ స్పూన్ నిమ్మ రసం కలిపి చంకలలో, ఎక్కువగా చెమట పట్టే చోట్ల రాసుకుని 5 నిముషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేయాలి. వంట సోడా తేమని ఎక్కువగా పీల్చివేస్తుంది. అది బాక్టీరియాని చంపి శరీర దుర్వాసనని తగ్గిస్తుంది. మీరు స్నానం చేసే నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ఆ నీటితో స్నానం చేస్తే శరీర నుండి వచ్చే చెడు వాసనను నివారించవచ్చు. వీటన్నిటింతోపాటు ఎక్కువగా నీళ్ళు తాగటం, పండ్లను తినడం, చిరుతిండ్లు మానేయడం చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. దీంతో చెమటతోపాటు దానివల్ల కలిగే దుర్వాసన నుంచి కూడా బయట పడవచ్చు.