గ్రీన్ టీని తాగడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అధిక బరువును తగ్గించేందుకు గ్రీన్ టీ ఎంతగానో సహాయ పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల రోజూ గ్రీన్ టీని తాగాలని వైద్యులు సూచిస్తుంటారు.
అయితే గ్రీన్ టీ ఆరోగ్యకరమైన లాభాలను అందించినప్పటికీ రోజుకు ఎన్ని కప్పుల గ్రీన్ టీని తాగాలో చాలా మందికి తెలియదు. దీంతో కొందరు మరీ తక్కువగా, కొందరు మరీ ఎక్కువగా గ్రీన్ టీని తాగుతుంటారు. కానీ మోతాదులో తాగితేనే గ్రీన్ టీతో లాభాలు కలుగుతాయి. మరి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందాలంటే గ్రీన్ టీని రోజుకు ఎన్ని కప్పుల మోతాదులో తాగాలంటే..
ఒక కప్పు గ్రీన్ టీలో.. అంటే 240 ఎంఎల్ గ్రీన్ టీని తాగితే మనకు దాదాపుగా 40 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ లభిస్తుంది. వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం మనం రోజుకు 300 మిల్లీగ్రాముల వరకు కెఫీన్‌ను తీసుకోవచ్చు. అంతకు మించితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే.. 300 మిల్లీగ్రాముల మేర చూస్తే రోజుకు దాదాపుగా 7 కప్పుల వరకు గ్రీన్ టీని తాగవచ్చు. కానీ కేవలం గ్రీన్ టీని మాత్రమే తాగితే ఈ సూత్రం వర్తిస్తుంది. కొందరు కాఫీ, టీ లతోపాటు గ్రీన్ టీని సేవిస్తారు. వాటిల్లోనూ కెఫీన్ ఉంటుంది. కనుక కాఫీ, టీలు తాగేవారు గ్రీన్ టీని తాగితే రోజుకు 3-4 కప్పుల వరకు గ్రీన్ టీని తాగవచ్చు.
ఇక కేవలం గ్రీన్ టీ మాత్రమే తాగుతాం అనుకుంటే రోజుకు 5-6 కప్పుల వరకు తాగవచ్చు. కానీ కొందరికి ఇంత మోతాదులో తాగితే గ్యాస్, అసిడిటీ వస్తాయి. కనుక ఈ విధంగా సమస్యలు వస్తే వారు రోజుకు 3 కప్పులకు మించకుండా గ్రీన్ టీని తాగాలి. మిగిలిన వారు ఒకటి, రెండు కప్పులు ఎక్కువగా అంటే.. 5 కప్పుల వరకు గ్రీన్ టీని తాగవచ్చు. ఈ విధంగా గ్రీన్ టీని తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.