ఆయుర్వేదలో అన్ని సమస్యలకి పరిష్కారం ఉంది. ఐతే ఆ పరిష్కారం కొంచెం ఆలస్యంగా వస్తుంది. కాకపోతే ప్రకృతి వైద్యం వల్ల ఎన్నో సమస్యలు దూరమవుతాయి. మనచుట్టూ కనిపించే చాలా మొక్కలు మనకి మేలు చేసేవే ఉంటాయి. మనం చేయాల్సిందలా ఏది మనకు బాగా పనికొస్తుంది, ఎందుకోసం పనికొస్తుంది అని తెలుసుకోవడమే. లెమన్ గ్రాస్.. దీన్ని తెలుగులో నిమ్మ గడ్డి అంటారు. ఈ నిమ్మగడ్డితో చేసిన టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శ్వాస సంబంధమైన ఇబ్బందులని దూరం చేయడంతో పాటు జీర్ణ సమస్యలని సమూలంగా పోగొడుతుంది. అంతే కాదు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తూ, జీవన విధానంలో మంచి మార్పును తీసుకువస్తుంది.
జ్వరం, రొంప, దగ్గు, జలుబు వంటి సాధారణమైన వాటిని పూర్తిగా తగ్గించడంలో లెమన్ గ్రాస్ టీ బాగా ఉపయోగపడుతుంది. బరువును తగ్గించడమే కాక, రక్తపీడన సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా, జుట్టు, చర్మ సమస్యలను రాకుండా చూసుకుంటుంది. శరీరంలో అనవసరమైన వాయువులు పేరుకోకుండా చూసుకుని, త్రేన్పులని తగ్గిస్తుంది. నిమ్మగడ్డి నుండి తీసిన నూనె మర్దనా చేసుకుంటే, కీళ్ళనొప్పులు తగ్గిపోతాయి. నిమ్మగడ్డి నుండి తయారు చేయబడ్డ పేస్ట్ రాసుకుంటే తామర పూర్తిగా తగ్గిపోతుంది. నరాలకి సంబంధించిన సమస్యలని తగ్గిస్తుంది. రుతుక్రమం సక్రమంగా జరగడంలోనూ, ఆ సమయంలో వచ్చే నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగించడంలో నిమ్మగడ్డి ప్రముఖ పాత్ర వహిస్తుంది.
నిమ్మగడ్డితో టీ తయారు చేసుకునే విధానం.. ఒక పాత్రలో సగం వరకు నీటిని తీసుకుని మరిగించాలి. ఆ తర్వాత దాన్లో లెమన్ గ్రాస్ ని వేసి, మరికొంత సేపు మరిగించాలి. మరిగిన ఆ పూర్తి మిశ్రమాన్ని వడపోసి గ్లాసులోకి ఒంపుకుని చల్లారాక సేవిస్తే సరిపోతుంది.