Mushrooms : మనకు ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్దమైన ఆహారాల్లో పుట్టగొడుగులు కూడా ఒకటి. ఇవి మనకు ఎక్కువగా వర్షకాలంలోనే దొరికేవి. కానీ నేటి తరుణంలో కాలంతో సంబంధం లేకుండా మనకు పుట్టగొడుగులు లభిస్తున్నాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూఉంటారు. పుట్టగొడుగులతో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. పుట్టగొడుగులను తిన్నప్పటికి చాలా మందికి వీటి గురించి అనేక సందేహాలు ఉంటాయి. పుట్టగొడుగులను తినవచ్చా.. లేదా.. ఇవి మాంసాహారమా… శాఖాహారమా.. వీటిని తీసుకోవడం వల్ల ఏమైనా లాభాలు కలుగుతాయా.. ఇలా అనేక రకాల సందేహాలు మనలో చాలా మందికి ఉన్నాయి. పుట్టగొడుగులను తినవచ్చా.. లేదా.. వీటి గురించి నిపుణులు ఏమంటున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టగొడుగులు శాఖాహారము. వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
100గ్రాముల పుట్టగొడుగుల్లో 30 నుండి 40 క్యాలరీలు ఉంటాయి. అలాగే వీటిలో 80 శాతం నీరు, 4.3గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2.5 గ్రాముల ప్రోటీన్, 1 గ్రాము ఫైబర్ తో పాటు అనేక రకాల ఖనిజాలు ఉంటాయి. అలాగే వీటిలో ఫ్యాట్ అస్సలు ఉండదు. వీటిని ఎవరైనా ఆహారంగా తీసుకోవచ్చు. పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల మనకు రెండు లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో మనలో చాలా మంది విటమిన్ డి, విటమిన్ బి12 వంటి విటమిన్స్ లోపంతో బాధపడుతున్నారు. దీంతో చాలా మంది రక్తహీనత, జుట్టు రాలడం, ఎముకలు గుళ్లబారడం, కీళ్ల నొప్పులు, నీరసం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ డి మన శరీరానికి సూర్యరశ్మి ద్వారా అందుతుందని మనందరికి తెలుసు. కానీ మనలో చాలా మందికి సూర్యరశ్మి తగలడమే లేదు. దీంతో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. అలాంటి వారు పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ డి అందుతుంది.
100గ్రాముల పుట్టగొడుగుల్లో 400 నుండి 1000 నానో గ్రాముల విటమిన్ డి ఉంటుంది. అలాగే విటమిన్ డి మన శరీరంలో 6 నెలల నుండి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. కనుక పుట్టగొడుగులు లభించినప్పుడు వీటిని తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపం రాకుండా ఉంటుంది. ఇక విటమిన్ డి తో పాటు పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల విటమిన్ బి12 కూడా లభిస్తుంది. శాఖాహారాల్లో విటమిన్ బి12 అసలే ఉండదు. కేవలం మాంసాహారంలోనే విటమిన్ బి12 ఉంటుంది. కానీ శాఖాహారమైన పుట్టగొడుగుల్లో విటమిన్ బి 12 ఎక్కువగా ఉంటుంది. కనుక శాఖాహారం తీసుకునే వారు పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల విటమిన్ బి12 లోపం రాకుండా ఉంటుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు, ఊబకాయంతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.